ఎట్టకేలకు కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. నిజానికి, చాన్నాళ్ల కిందటే కమల్ పార్టీ పెడతారనే చర్చ మొదలైంది. దానికి అనుగుణంగానే ఆయన పలువురు నేతలతో కలవడం, ముఖ్యంగా కమ్యూనిస్టులతో చర్చలు జరపడం వంటివి చాలానే జరిగాయి. కానీ, రజనీకాంత్ పార్టీ అంశం తెరమీదికి వచ్చాక కమల్ కాస్త తగ్గనట్టు అనిపించింది. ఆ తరువాత, రాజకీయ రంగం ప్రవేశం గురించి రజనీ ఒక ప్రకటన చేయడం, త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నానని స్పష్టం చేయడం, రాజకీయాల్లో ఆధ్యాత్మిక ధోరణి అవసరం అని చెప్పడం.. ఇలా అన్నీ జరిగాయి. అయితే, కాస్త ఆలస్యంగా ఇప్పుడు కమల్ కూడా పార్టీ ప్రకటన చేస్తున్నారు. మదురై నుంచి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. మదురై నుంచి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టడం అనేది తమిళనాట ఓ సెంటిమెంట్. ఎంజీఆర్, జయలలిత వంటివారు తొలి బహిరంగ సభలను అక్కడే పెట్టారు. కమల్ కూడా అదే తరహాలో అక్కడి నుంచే ప్రస్థానం మొదలుపెడుతున్నారు.
పార్టీ విధివిధానాల విషయంలో రజినీ కంటే కమల్ మరింత స్పష్టంగానే ఉన్నట్టు అనిపిస్తోంది. అన్నాడీఎంకే కి ప్రత్యామ్నాయంగా తన పార్టీని నిలబెట్టాలన్నది కమల్ ప్రయత్నం. అందుకే, ఆయన అన్నాడీఎంకే మినహా ఇతర పార్టీలకు చెందినవారితో ముందస్తుగా చర్చలు జరుపుతున్నారు. అన్నాడీఎంకేను బంగాళాఖాతంలో కలిపేయాలని కూడా ప్రకటన చేశారు. ఇంకోపక్క, కేంద్రంలోని భాజపాకి వ్యతిరేకంగా కమల్ పార్టీ విధానం ఉంటుందనేది కూడా కొంత స్పష్టంగానే ఉంది. నిజానికి, తమిళనాట ‘భాజపా వ్యతిరేకత’ అనే అంశానికి కొంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత తమిళ రాజకీయాలను తమ అదుపులోకి తెచ్చుకునేందుకు భాజపా చాలా ప్రయత్నించింది. చివరికి, పన్నీర్ సెల్వమ్, పళని స్వామి వర్గాలను పునరేకీకరణ చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలకపాత్ర పోషించారని పన్నీర్ ఇటీవలే ప్రకటించారు. అంతేకాదు, అన్నాడీఎంకే పార్టీని కాపాడాల్సిన బాధ్యత ఉందని మోడీ చెప్పినట్టు ఆయన ప్రకటించడం విశేషం.
రజనీ కూడా రాజకీయాలకు సిద్ధమని ప్రకటించినా, పార్టీ విధివిధానాలకు సంబంధించి మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఆయన ‘ఆధ్యాత్మిక రాజకీయాలు ’చేస్తానన్నారు. ఆధ్యాత్మికత అంటే ఇదేదో పరోక్షంగా భాజపా భావజాలానికి దగ్గరగా ఉందనే అభిప్రాయం కూడా తమిళనాట కాస్త బలంగానే ఉంది. రజనీ పార్టీకి భాజపా అండదండలు ఉంటాయంటూ వ్యక్తమైన అభిప్రాయాలను రజనీ నిర్ద్వంద్వంగా ఖండించిందీ లేదు. ఈ నేపథ్యంలో కమల్ పార్టీ పెడుతూ ఉండటం తమిళ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంకోపక్క, కమల్ పార్టీని చాలా లైట్ గా తీసుకుంటున్నారు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. రజనీ, కమల్ లాంటివాళ్లు కాగితం పువ్వులనీ, వాటికి వాసన ఉండదంటూ ఆయన విమర్శించారు. దీనికి కౌంటర్ గా కమల్ స్పందిస్తూ.. తాను కాగితం పువ్వు కాదనీ, విత్తనం లాంటివాడిననీ ఏపుగా పెరుగుతాననీ, విత్తనం వాసన చూడాల్సిన పనిలేదని బదులిచ్చారు.