రాజకీయాల్లోకి దిగగానే అందరికీ `ఫ్రీ.. ఫ్రీ` అనే మాట అలవాటైపోతుందేమో..? అసలు ఎవరికీ అంతుపట్టని, అర్థంకాని పథకాల్ని ప్రవేశ పెట్టాలని అనిపిస్తుందేమో..? రాజకీయాల్లోకి కొత్తదరం వచ్చినా.. వాళ్ల ఆలోచనలన్నీ `పాత` ధోరణిలోనే సాగుతాయని కమల్ హాసన్ ప్రయత్నాలు, వాగ్దానాలు చూస్తుంటే అర్థం అవుతోంది.
తమిళనాట రాజ్యాధికారమే లక్ష్యంగా కమల్ హాసన్ ఓ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కమల్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఈసారి ఎలాగైనా సరే, తనదైన ముద్ర వేయాలని కమల్ గట్టిగా భావిస్తున్నాడు. మిత్రుడు రజనీకాంత్ పార్టీ పెట్టడం లేదు కాబట్టి, తనకు ఈసారి పెద్దగా పోటీ ఉండదన్నది కమల్ ధీమా. దానికి తోడు వినూత్న పథకాలు, వాగ్దానాలతో.. అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ.. తను కూడా ఫక్తు రాజకీయ నాయకుడినే అనిపించుకుంటున్నాడు.
తాజాగా… గృహిణులకు నెలవారీ జీతాలిస్తాం అని ప్రకటించాడు కమల్. ఇంటి పట్టునే ఉంటూ, ఇంటిని చక్కబెట్టే ఇల్లాళ్ల సేవలకు ఉత్తమమైనవని, వాళ్లెన్నో త్యాగాలు చేస్తుంటారని, వాటికి గుర్తింపుగా.. గృహిణులకు నెలవారీ జీతాలిచ్చి గౌరవిస్తామని కమల్ ప్రకటించడం.. తమిళనాట రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇదంతా… కమల్ మహిళా ఓటర్లని తన వైపుకు ఆకట్టుకునే ప్రయత్నమే. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇదంతా ప్రాక్టికల్ గా జరుగుతుందా, లేదా? అనేది డిబేటబుల్ పాయింట్. దీనిపై తమిళనాట మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. మహిళలకు జీతాలివ్వడం మంచి నిర్ణయమని కొంతమంది చెబుతుంటే, వాళ్ల శ్రమకు విలువ కడతారా? అంటూ ఇంకొంతమంది విమర్శలకు దిగుతున్నారు. దీనిపై కంగనా రనౌత్ సైతం ఘాటైన వ్యాఖ్యలే చేసింది. మహిళల శ్రమని డబ్బుతో పోల్చలేరని, వాళ్లు భర్త నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ప్రేమ మాత్రమే ఆశిస్తారని, జీతం కాదని.. వ్యాఖ్యానించింది. మహిళలు ఇంటినే తమ సామ్రాజ్యంగా మార్చుకుంటారని, అది వాళ్ల హక్కు అని.. దాన్ని కూడా లాగేసుకోవడానికి చూడొద్దని హితవు కలికింది.
ఇంట్లో ఉండండి.. జీతాలిస్తాం అని చెప్పడం ఆడవాళ్లని ఇంకా వంటింటికే పరిమితం చేసే ఆలోచన అని ఇంకొంతమంద దుయ్యబడుతున్నారు. ఆడవాళ్లు ఆఫీసులకెళ్తే.. ఇంట్లో మగాళ్లు పనిచేస్తే వాళ్లకూ జీతాలు ఇస్తారా? అంటూ ఇంకొంతమంది సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి కమల్ కూడా మామూలు రాజకీయ నాయకుడిగా పథకాల పేరు చెప్పి జనాల్ని ఆకట్టుకోవడంలో పడిపోయాడు. మరి.. ఓటర్లు కమల్ ని నమ్ముతారా? లేదా..? అనేది తెలియాలంటే తమిళనాట ఎన్నికలు రావాల్సిందే.