లోక్ సభ ఎన్నికలకు దూరమని.. రజనీ కాంత్ ప్రకటించినప్పటికీ.. మరో సూపర్ స్టార్ కమల్ హాసన్ మాత్రం. దూకుడు పెంచారు. తమిళనాడులో తనకు.. స్టాలిన్ కు మధ్యనే పోటీ ఉందన్న రీతిలో ప్రకటనలు ప్రారంభించారు.రాజకీయాలోకి వచ్చి తన భాగస్వామ్యం ఏంటో చెప్పానని..ఇక, మీ భాగస్వామ్యం అందించండి అంటూ ప్రజలకు కమల్ పిలుపునిచ్చారు. అసెంబ్లీకి తాను వెళ్తే..చొక్కా చింపుకుని నిలబడనని, మరో చొక్కాను అక్కడే మార్చుకునే వాడినని స్టాలిన్ ను ఉద్దేశించి కమల్ కామెంట్స్ చేశారు. గతంలో అసెంబ్లీ వేదిగా స్టాలిన్ చొక్కా చిరగడం, వివాదం రేగడాన్ని ఈ సందర్భంగా కమల్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఎవరు ఉన్నా, తమిళనాడుకు జరిగేది ఏమీ లేదని, అందుకే ఢిల్లీలో తానూ ఉండాలని భావిస్తున్నట్టు చెప్పారు కమల్. మీసం మెలేయడం, తొడలు కొట్టడం గౌరవం కాదని విరుచుకు పడ్డారు. ఇక, పార్టీ ప్రకటించి, రాజకీయ కార్యక్రమాల్లోకి రాను అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ పరోక్షంగా రజనీని టార్గెట్ చేస్తూ లోకనాయకుడు కామెంట్స్ చేయడం..రాజకీయంగా కాకరేపుతోంది.
రాజకీయాలు ప్రజల జీవితంలో ఓ భాగం మాత్రమేనన్న కమల్ హాసన్.. చాలా ఆలస్యంగా పాలిటిక్స్ లోకి రావడంపై ఆవేదన చెందుతున్నానన్నారు. అందుకు క్షమాపణలు కూడా చెప్పారు. విద్యార్థులకు రాజకీయాల్లో ప్రవేశం ఉండాలని..ప్రతి ఒక్కరూ ఈ రంగంలోకి రావాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేయడం కన్నా..పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని యువతకు సూచించారు. తమిళం అన్నది చిరునామా అని, అర్హత కాదని వ్యాఖ్యానించారు. ఏమి చేశాం అన్నది అర్హతగా అభివర్ణించారు. నాలుగు సినిమాలు చేయాల్సిన చోట ఓ సినిమా చేస్తున్నానని..అది కూడా తన పార్టీకి నిధుల కోసమేనంటూ తచెప్పుకొస్తున్నారు.
లోకనాయకుడి వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలతో పాటు..రెండేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనా గురిపెట్టినట్టు కనిపిస్తోంది. అందులో భాగంగా ఇప్పటినుంచే ప్రతిపక్షాలను కవ్విస్తున్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్ .. లోక్ సభ ఎన్నికల్లో బరిలో లేరని.. తెలిసిన తర్వాత.. ప్రధాన పోటీ…ఎవరి మధ్య ఉంటుందన్న చర్చ తమిళనాట ప్రారంభమయింది. స్టాలిన్ ఇప్పుడు తమిళనాడులో టాప్ లీడర్ గా ఉన్నారు. ఆయనకు పోటీ వచ్చే జనాకర్షణ నేత.. కమల్ హాసనే అవుతారు. రజనీ రంగంలోకి లేరు కాబట్టి.. ఆ చాయిస్ కమల్ కు దక్కింది.దాన్ని ఉపయోగించుకుని స్టాలిన్ ఢీకొట్టే లీడర్ గా ఎదగాలని కమల్ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నట్లు.. రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.