సినిమాలకు సంబంధించిన నటన, దర్శకత్వంతో పాటు ఇంకా చాలా విషయాల్లో కమల్‌కి మంచి విషయ పరిజ్ఙానం ఉంది. అనేక ఇతర విషయాలపైన కూడా తనకు అవగాహన ఉంది అని చెప్పుకుంటూ ఉంటాడు కమల్. రాజకీయ అవినీతి, రాజకీయాల గురించి అయితే విషయంలేకపోయినా బోలెడన్ని మాటలు మాట్లాడవచ్చు. రాజకీయ అవినీతి గురించి సినిమా వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైట్ అవుతూ ఉంటారు. ‘మా వాడు సూపర్’ అని చెప్పి మిగతా హీరోల ఫ్యాన్స్‌తో వాదించుకుంటూ ఉంటారు. ఆ క్రేజ్‌ని చూసుకుని సినిమావాళ్ళు ఇంకాస్త రెచ్చిపోతూ ఉంటారు. అన్ని విషయాలపైనా అవగాహన లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పుడు కమల్ హాసన్ కూడా అలాంటి కామెంట్సే చేశాడు. పుట్టుకతో హిందువు అయిన కమల్..ఆ తర్వాత మతం మార్చుకున్నాడు. అది ఆయన వ్యక్తిగతం. ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. ఎవరూ ప్రశ్నించడానికి లేదు. కానీ బాధ్యత గల స్థానంలో ఉన్న కమల్ హిందూ మతం గురించి ఇష్టారీతిన మాట్లాడడం మాత్రం ఇప్పుడు హిందువులను బాధిస్తోంది. పవిత్ర గ్రంథం పేరు ప్రస్తావించకుండా ఓ లూజ్ కామెంట్ పాస్ చేశాడు కమల్ హాసన్. మహాకావ్యంగా భావించే ఒక మహాగ్రంథంలో ఒక మహిళ తీవ్ర అన్యాయానికి గురైపోయింది అని చెప్పి చెప్పుకొచ్చాడు కమల్.
రామాయణ, మహాభారతాల్లో ఉన్న స్త్రీ పాత్రలకు జరిగిన అన్యాయం గురించి ఇదే రకమైన వాదనను చాలా మంది చాలా రకాలుగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఇప్పటి కాలమాన పరిస్థితుల నుంచి చూస్తే వాళ్ళ వాదన కొంత వరకూ నిజం అని కూడా చెప్పొచ్చు. కానీ మానవసంబంధాలకు సంబంధించిన తప్పొప్పులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు నేటి కాలమాన పరిస్థితులతో పోల్చి నాటి విషయాలను ఎలా విమర్శిస్తాం? ఆ మహాగ్రంధాలలో చేసినట్టుగా ఈ రోజు ఎవరైనా చేస్తే అది కచ్చితంగా తప్పే. కానీ ఆ రోజు ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, మానవసంబంధాలు ఈ రోజు ఉన్నట్టుగా లేవు అనే విషయం కమల్‌కి తెలియదా? ఒకవేళ కమల్ మాటలు నిజమే అనుకున్నా…అన్ని మత గ్రంథాల్లోనూ స్త్రీలకు తీవ్రమైన అన్యాయమే జరిగిందిగా. స్త్రీని పరదా మాటున బంధించిన గ్రంధాలు ఎన్నిలేవు. ఈ రోజుకు కూడా వేల ఏళ్ళ క్రితంనాటి సాంప్రదాయులు, ఆచారాలు పాటిస్తూ స్త్రీకి కనీస స్వాతంత్ర్యం లేకుండా చేస్తున్న మతాలు ఎన్నిలేవు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా తప్పేలేదు. అంతా మగాడి ఇష్టం. పురుషుని రాజ్యం. పురుషున్ని సంతోషపెట్టటం కోసమే స్త్రీ ఉంది అని చెప్తున్న మతాచార్యులు కనిపిస్తూనే ఉన్నారుగా. మరి వాళ్ళ గురించి కూడా మాట్లాడే ధైర్యం ఉందా శ్రీ కమల్ హాసన్‌కి. సున్నితమైన విషయాలపైన స్పందించాలి అనుకున్నప్పుడు సమగ్రంగా మాట్లాడాలి. అన్ని మతాల్లో ఉన్న దురాచారాలు, స్త్రీలకు జరిగిన, జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడితే కమల్ హాసన్‌ని తప్పు పట్టడానికి ఏమీ లేదు. కానీ ఎంత పెద్ద విషయం గురించి విమర్శిస్తున్నాను, ఎన్ని కోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం గురించి మాట్లాడుతున్నాను అన్న స్పృహ లేకుండా ఓ లూజ్ కామెంట్ పాస్ చేయడం మాత్రం కచ్చితంగా కమల్ హాసన్ స్థాయికి తగదు. ఉన్న గౌరవాన్ని పోగొట్టుకునే ఇలాంటి చర్యలు మరోసారి కమల్ హాసన్ నుంచి రాకూడదని కోరుకుందాం.