‘ఆదిత్య 369’.. బాలకృష్ణ సినీ జీవితంలో మర్చిపోలేని సినిమా. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. బాలయ్య ఆల్ టైమ్ ఫేవరెట్లలో ఈ సినిమా కూడా ఉంది. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని బాలయ్య తహతహలాడుతుంటారు. నిజానికి.. ఈసినిమా బాలయ్య చేయాల్సింది కాదు. ముందు కమల్ హాసన్ కోసం ఈ కథ అల్లారు సింగీతం శ్రీనివాసరావు. అప్పటికే కమల్ – సింగీతంది సూపర్ హిట్ కాంబినేషన్. కమల్ అంటే సింగీతంకీ, సింగీతం అంటే కమల్కీ ప్రత్యేకమైన అభిమానం. అందుకే.. ‘ఆదిత్య 369’ కూడా ఇదే కాంబోలో రావాలి.
కథ రాసుంటున్నప్పుడు ఓ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణని ఎంచుకుందాం అనుకున్నారు సింగీతం. ఆ పాత్రే.. శ్రీకృష్ణదేవరాయులు. టైమ్ మిషన్లో ఎక్కి, శ్రీకృష్ణ దేవరాయుల కాలంలో వాలిపోతాడు హీరో. అక్కడ.. శ్రీకృష్ణదేవరాయులుగా బాలయ్య కనిపించాలి. ఇదీ ముందుగా అనుకున్న ప్లాను. కమల్ హసన్, బాలయ్య కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా రూపొందించాల్సిన సినిమా ఇది. అన్నీ ఓకే అయిపోయాక, ఎందుకో కమల్ హాసన్ ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యారు. తనకు అప్పటికే చాలా సినిమాలున్నాయి. అవి పూర్తయ్యేంత వరకూ ‘ఆదిత్య 369’ చేయలేనని సింగీతంతో చెప్పారట. కమల్ వచ్చేంత వరకూ ఈ ప్రాజెక్టు ఆపడం ఇష్టం లేని సింగీతం.. రెండు పాత్రలూ.. బాలయ్యతోనే వేయించాలని ఫిక్స్ అయ్యారు. అలా.. బాలయ్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయాల్సివచ్చింది.