దక్షిణాది సినీనటుడు, నిర్మాత కమల్ హాసన్ ఆలోచనలు ఇప్పుడు అహింసా సిద్ధాంతం చుట్టూ తిరుగుతున్నాయి. నటుడిగా విశ్వరూపాన్ని ప్రదర్శించిన కమల్ మరో ప్రయోగానికి తెరదీయబోతున్నారు . ప్రపంచంలోని ఏ సమాజంలోనైనా కనిపించే సిద్ధాంతాలను, మానవ ఆలోచనలను పుక్కిటపట్టగల మహా నటుడు ఆయన. ఆస్కార్ అవార్డుల స్థాయిని మించిపోయిన మహానటుడిగా మనదేశం ఏనాడో గుర్తించింది.
క్రైమ్ థిల్లర్ – తూంగావనం సినిమా (తెలుగులో చీకటి రాజ్యం) సినిమా నవంబర్ 10 మంగళవారంనాడు రిలీజ్ అయింది. అదే రోజున శాంతిదూత, బౌద్దమత గురువు దలైలామా చెన్నైకి వచ్చారు. గాంధీజీ అహింసా సిద్ధాంతం పట్ల తరచూ ఆసక్తి కనబరిచే కమల్ ఈ మత గురువుని కలుసుకున్నారు. వారి మధ్య ఆసక్తికరమైన చర్చ కూడా జరిగింది. మద్రాస్ ఐఐటీలో అబ్దుల్ కలాం సేవారత్న అవార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో `ప్రపంచ శాంతి దిశగా మానవ వైఖరి’ అన్న అంశంపై మతగురువు దలైలామా మాట్లాడారు.
అనేకమంది మతగురువుల గురించి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నా కమల్ ఏనాడూ మతాచార్యుల వద్దకు వెళ్లలేదు, మతపరమైన విషయాలపట్ల ఆసక్తి చూపనూలేదు. అయితే ఇప్పుడు గాంధీ సిద్ధాంతాల పట్ల ఆసక్తి ఉండటంతో తాను దలైలామాను కలుసుకున్నట్లు కమల్ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.
`మతపరమైన విషయాలపై నాకు అనాసక్తి, అలాగే, దలైలమా గారికి సినిమాలంటే అనాసక్తి, ఈ విషయంలో మా ఇద్దరి ఆలోచనలు మ్యాచ్ అయ్యాయి. దలైలామాగారు ఒక్క సినిమా కూడా చూడలేదు. కనీసం టివీలో కూడా. అయినప్పటికీ సినీ మీడియా మీద ఆయనకు స్పష్టమైన ఆలోచన ఉంది. దాన్ని షేర్ చేసుకున్నాం. దలైలామాగారు సినీ మీడియా ద్వారా ప్రపంచానికి భారతీయ అహింసా సిద్ధాంతాన్ని చాటిచెప్పే విషయంలో ఆసక్తి చూపించారు. సలహా ఇచ్చారు. అహింస పట్ల నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ దిశగా ఒక వెంచర్ ప్లాన్ చేస్తాను’ అని కమల్ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. `నా ఆలోచనలు మతబోధనలవైపు వెళ్లకపోయినా మా ఇద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడింది. అది అహింసా సిద్ధాంతానికి కట్టుబడి ఉంది’ అనంటూ తనలోని ఆలోచనలకు బీజం వేశారు కమల్. బహుశా ఈ బీజం మొలకెత్తితే కమల్ సినిమా కథ దలైలామా వంటి మతగురువుల చుట్టూ తిరగవచ్చు. దలైలమా పాత్రతోపాటుగా మరికొంతమంది ప్రపంచ మత గురువుల పాత్రలను కూడా కమల్ పోషించే అవకాశం లేకపోలేదు.
దశావతారం సినిమాలో ఆస్తికునిగా, నాస్తికునిగా, శాస్త్రవేత్తగా, చివరకు తీవ్రవాదిగా కూడా నటించి అందరిమన్ననలు పొందిన కమల్ ఆలోచనలు అహింసా సిద్ధాంతంవైపు మళ్లడంతో మరో అద్భుత చిత్రం ప్రేక్షకులకు త్వరలోనే అందుతుందని ఆశించవచ్చు. దలైలామాని కమల్ కలుసుకోవడాన్ని కొంతమంది వక్రీకరించి, కమల్ బౌద్ధమతంలో చేరబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే, ఏ మతసారాన్నైనా ఔపోసన పట్టగల సత్తా ఉన్న మహానటుడికి ఏదో ఒక మతంలో చేరాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి కమల్ ఎలాంటి సాందేశాత్మక చిత్రం అందించబోతున్నారో వేచిచూద్దాం.
– కణ్వస