కమల్ హాసన్ గొప్ప నటుడే కాదు, గ్రేట్ టెక్నిషియన్. విలక్షణ దర్శకుడు. కమర్షియల్ విజయాలతో సంబంధం లేకుండా వెండితెరపై తనవైన చిత్రాలు గీయాలనుకునే దర్శకుడు. అలా తన దర్శకత్వంలో ‘విశ్వరూపం’ చూపించాడు కమల్ హాసన్. మంచి విజయం సాధించిందీ సినిమా. అయితే ఈ సినిమాకి పార్ట్ 2 ఉంది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది.
అయితే కొన్ని ఆర్ధిక కారణాల వల్ల విడుదలకు నోచుకోలేకపోతుంది. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడమే ఇందుకు కారణం. అయితే ఇప్పుడీ సినిమాకి సంబంధించి ఆర్ధిక సమస్యలు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి సంబధించి కొన్ని స్టిల్స్ మీడియాకు అందించాడు కమల్. విదేశాల్లో వ్యాపారం చేస్తున్న కమల్ స్నేహితుడు ఒకరు ఈ సినిమాకి కావాల్సిన ఆర్ధిక సహాయం అందించడంతో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
విశ్వరూపం 1 విషయంలో కమల్ పలు వివాదాల్ని ఎదుర్కొన్నాడు. తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ చిత్రాన్ని నిలిపివేసింది. చాలా చోట్ల నిషేధించింది. అయితే వాటన్నింటినీ తట్టుకొని చిత్రాన్ని విజయతీరాలకు చేర్చాడు కమల్. మరి విశ్వరూపం 2 విషయంలోనూ ఇలాంటి వివాదాలే ఎదురవుతాయా? లేదంటే ఈసారి కమల్ ప్రయాణం సాఫీగా సాగుతుందా?? అనే ప్రస్తుతానికి సస్పెన్స్.