హైదరాబాద్: బహుభాషా నటుడు కమలహాసన్ మొదటిసారి ఒక వాణిజ్య ప్రకటన చేశారు. తన 50 ఏళ్ళ నటజీవితంలో ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ యాడ్ కూడా చేయని కమల్, తొలిసారి తమిళనాడుకు చెందిన ప్రముఖ వస్త్రదుకాణాలసంస్థ ‘పోతీస్’కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. దీనికోసం ఆయన నటించిన ఒక టీవీ యాడ్ ఇవాళ విడుదలయింది. చక్కటి సాంకేతిక విలువలతో రూపొందిన ఈ యాడ్, చూడగానే ఆకట్టుకునేలా ఉంది. సినిమాలలో తన నటన చూసి ప్రజలు తనపై నిస్వార్థంగా అభిమానాన్ని కురిపిస్తుంటారని, ‘పోతీస్’ సంస్థకూడా అలాగే తన విశ్వసనీయతతో ప్రజల అభిమానాన్ని చూరగొందని కమల్ ఆ యాడ్‌లో చెబుతుంటారు. ఈ ప్రకటనకోసం కమల్‌కు పోతీస్ సంస్థ భారీమొత్తాన్నే ముట్టజెప్పిందని సమాచారం. ఈ ప్రకటనద్వారా వచ్చే మొత్తాన్ని కమల్ ఒక మంచి ప్రయోజనంకోసం వాడుతున్నారు. ఎయిడ్స్‌తో బాధపడే చిన్నారులకు ఈ మొత్తాన్ని అందజేస్తారు. 1.02 నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రకటనను కృష్ణకుమార్ అనే కోలీవుడ్ దర్శకుడు రూపొందించారు. ఇటీవల కమల్ సినిమాలన్నింటికీ సంగీతం అందిస్తున్న జిబ్రాన్ ఈ యాడ్కుకూడా సంగీతాన్ని అందించారు.
[youtube http://www.youtube.com/watch?v=NHM1aUH-Cqg&w=640&h=360]