ఎమ్.ఎన్.ఎమ్. పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ తాజాగా ఢిల్లీలో కనిపించారు! ముందుగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి, కాసేపు ముచ్చటించారు. ఆ తరువాత, సోనియా గాంధీతో కూడా సమావేశమయ్యారు. అయితే, ఇది మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమే.. రాజకీయ కోణాలు ఆపాదించొద్దు అని కమల్ అంటున్నారు. భేటీ మర్యాదపూర్వకమే అయినప్పుడు… ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఆయన ఎందుకు కలవలేదన్నది కూడా పాయింటే కదా! ఎందుకంటే, కమల్ పార్టీ ఏర్పాటు సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెన్నైకి వచ్చారు. కమల్ కు మద్దతుగా మాట్లాడారు. అలాంటప్పుడు, ఢిల్లీ వరకూ వచ్చిన కమల్ మర్యాదపూర్వకంగానైనా ఆయన్ని కలవాలి కదా!
కమల్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో తమిళనాట ఓ చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో ఎమ్.ఎన్.ఎమ్. జతకట్టే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే వ్యతిరేకంగానీ, జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేకంగానీ కమల్ రాజకీయం ఉంటుందని అనుకుంటే… ఈ క్రమంలో కాంగ్రెస్ కు దగ్గరయ్యే ఊహాగానాలకు తాజా భేటీ ఆస్కారమిస్తోంది. కమ్యూనిస్టులూ, కాంగ్రెస్ పార్టీలతోపాటు మరికొన్ని పార్టీలు కూడా ఒక శిబిరంగా ఏర్పడబోతున్న పరిస్థితి జాతీయ స్థాయిలో కనిపిస్తోంది. ఇప్పుడు కమల్ ఆ శిబిరంవైపే మొగ్గు చూపుతారనే అనుకోవచ్చు.
అయితే, దేశంలో భాజపాయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాట్లు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. కమల్ రాజకీయం ఈ రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఉంటుందని చెప్పలేం. అందుకు సాక్ష్యం అరవింద్ కేజ్రీవాల్ ను ఆయన కలవకపోవడమే. కేజ్రీవాల్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కలిశారు. కాబట్టి, ఫెడరల్ ఫ్రెంట్ గొడుగు కిందకి ఆయన వచ్చేలా ప్రస్తుతానికి లేరు. అలాగని, తమిళనాడులో డీఎంకేతో కలిసి పనిచేయడం అనేది సాధ్యమా అనే చర్చ కూడా ఉంది. అన్నాడీఏంకేకి వ్యతిరేకంగానే కమల్ రాజకీయం ఉంటుందనేది సుస్పష్టం. అయితే, ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతోనే కమల్ ఢిల్లీ వెళ్లారనీ కూడా చెప్పలేం. ఎందుకంటే, ఈ మధ్యనే పార్టీ పెట్టారు. మున్ముందు పరిస్థితులు ఎలా మారుతాయో తెలీదు. కాబట్టి, ఎన్నికలు వచ్చేనాటికి మారే పరిస్థితులకు అనుగుణంగా కమల్ ఎటువైపు మొగ్గుచూపుతారనే స్థిరమైన నిర్ణయం అప్పుడు ఉండొచ్చు. కానీ, తాజా ఢిల్లీ భేటీ ఇస్తున్న సంకేతాలైతే.. యూపీయేవైపు కమల్ మొగ్గుతున్నట్టుగా ఉన్నారనే.