ఒలింపిక్స్‌లో భారత్‌కు సూపర్ సోమవారం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అధ్లెటిక్స్‌లో భారత్ ఖాతా తెరిచే చాన్స్ ఉంది. భారత అధ్లెట్ కమల్ ప్రీత్ .. ఈ మేరకు ఆశలు రేకెత్తించే ప్రతిభతో ఫైనల్ చేరుకున్నారు. ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకూ భారత్‌కు అధ్లెటిక్స్ విభాగంలో ఒక్కటంటే ఒక్క పతకం రాలేదు. జీవ్ మిల్కా సింగ్, పీటీ ఉష లాంటి వాళ్లు అద్భుత ప్రదర్శన చూపినా.. ఒలింపిక్స్ పతకం వరకూ రాలేదు. కానీ ఆ లోచను కమల్ ప్రీత్ ఈ రోజు తీర్చడం ఖాయమని దేశం మొత్తం నమ్ముతోంది.
కమల్ ప్రీత్ డిస్కస్ త్రో ప్లేయర్. అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ చేరుకుంది. ఈ రోజు సాయంత్రం జరగనున్న ఫైనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. పంజాబ్‌కు చెందిన 25 ఏళ్ల కమల్‌ప్రీత్ క్వాలిఫయింగ్‌లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా పతకంపై ఆశలు చిగురించాయి. క్వాలిఫయింగ్‌లోని తన గ్రూప్‌లోనే కాకుండా ఓవరాల్‌గా కూడా కమల్‌ప్రీత్ రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఆమె .. పతకం ఖాయంగా తెస్తారన్న నమ్మకంతో క్రీడా విశ్లేషకులు ఉన్నారు.
ఫైనల్లో మొత్తం 12 మంది పోటీపడుతున్నారు. డిస్క్‌ను ఎక్కువ దూరం విసిరిన ముగ్గురికి వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి. గత రెండు ఒలింపిక్స్‌లో డిస్కస్ త్రో స్వర్ణాలు గెలిచిన క్రోయేషియా ప్లేయర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అయిన క్యూబా ప్లేయర్ ఇద్దరి కంటే .. కమల్ ప్రీత్ మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే క్వాలిఫయింగ్ పోటీల కంటే ఫైనల్స్ భిన్నంగా ఉంటాయి. కమల్ ప్రీత్ తమ ప్రదర్శన మెరుగు పర్చుకుంటే… పతకం ఖాయమే. సుదీర్ఘమైన భారతీయుల నిరీక్షణ ఫలించినట్లే.