ఏప్రిల్ 28.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఆ సినిమాపై ఆత్రుత, అంచనాలూ పెరిగిపోతున్నాయ్. బాహుబలి 2 ఎలా ఉండబోతోందా?? బాహుబలి 1కి మించిన అద్భుతాలు ఇందులో ఏమున్నాయా అంటూ ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురుచూస్తున్నారంతా. బాహుబలి 1లో జలపాత దృశ్యం… ఓ అద్భుతం. కథంతా మలుపు తిరిగేది అక్కడే. యుద్ధ సన్నివేశాలు, మంచు కొండలు.. ఇవన్నీ థ్రిల్‌కి గురి చేశాయి. పార్ట్ 2లో ఇంతకు మించిన అద్భుతాలున్నాయంటున్నారు విఎఫ్ఎక్స్ నిపుణులు కమల్ కణ్ణన్. బాహుబలి 1లో జలపాత దృశ్యాలు హైలెట్ అయ్యాయి. పార్ట్ 2లోనూ నీటికి సంబంధించిన ఓ ఎపిసోడ్ ఉందట. అది విజువల్ వండర్‌గా నిలచిపోతుందంటున్నారు కమల్ కన్నణ్.
పార్ట్ 1లో యుద్ద సన్నివేశాల కోసం ఎక్కువగా గ్రాఫిక్స్ వాడారు. పార్ట్ 2లో అయితే ఓ పాట మొత్తం గ్రాఫిక్స్‌తో నిండిపోయి ఉంటుందట. ఆ పాట నభూతో.. న భవిష్యత్ అనే రేంజులో రాజమౌళి తీర్చిదిద్దారంటున్నారు కమల్ కణ్ణన్. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల్లో ఏ సన్నివేశం కోసం ఎక్కువ కష్టపడ్డారంటే.. చెప్పలేకపోతున్నాడీ మాయా మాంత్రికుడు. ‘ప్రతీ సన్నివేశానికీ ఒకేలా కష్టపడ్డాం. ఒకటి ఎక్కువ మరోటి తక్కువ కాదు. నా జీవితంలో ఇప్పటి వరకూ పనిచేసిన చిత్రాల్లో బాహుబలినే గొప్ప… నా జీవితాంతం ఈ సినిమాని గుర్తు పెట్టుకొంటూనే ఉంటా’ అంటున్నారు కమల్ కణ్ణన్. ఈ మాటలతో.. ‘బాహుబలి 2’పై మరింతగా అంచననాలు పెరిగిపోవడం ఖాయం.