నిజామాబాద్ జిల్లాలో అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చింది. టిక్కెట్లు రాని వాళ్లు తిరుగుబాటు పథంలో ఉన్నారు. కామారెడ్డి మినహా మిగిలిన మూడు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి దీంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. 4 నియోజకవర్గాలకు గాను ఒక కామారెడ్డి లోనే అంతా సజావుగా ఉంది. ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు సిద్ధమైన నేతలను పార్టీ అధిష్టానం కూడా పట్టించుకోకపోవడంతో వారు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలతో కొంత పట్టు సంపాదించిన మాల్యాద్రి రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రెడ్డి ని డీ కొట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు.
అయితే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజుకు టికెట్లు కేటాయించారు. మాల్యాద్రి రెడ్డి కి నిరాశ ఎదురైంది . దీంతో అయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు కార్య కర్తల సూచనల మేరకు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇండిపెండెంట్ గా బరిలో నిలవాలని నిర్ణయించుకుని నామినేషన్ కూడా దాఖలు చేశారు తాను పోటీలో ఉంటానని ప్రకటించారు. దీంతో బాన్సువాడ లో కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు వేడెక్కాయి ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తారు అనుకున్న పార్టీ శ్రేణులు మాల్యాద్రి రెడ్డి తిరుగుబాటు తో ఆందోళన చెందుతున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్లు బీసీ సామాజికవర్గానికి చెందిన నల్ల మడుగు సురేందర్ కేటాయించారు. అయితే ఇక్కడ టికెట్ కోసం వడ్డేపల్లి సుభాష్ రెడ్డి చివరి నిమిషం వరకు ప్రయత్నించారు గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన సుభాష్ రెడ్డి రేవంత్ రెడ్డి తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో తన వర్గాన్ని ఏర్పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి తో కలిసి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఒక దశలో సుభాష్ రెడ్డి కె టికెట్ వస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ రాలేదు. దాంతో సుభాష్ రెడ్డి తిరుగుబాటు సిద్ధమవుతున్నారు. ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేస్తారని ప్రకటించారు. కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నా నల్లమడుగు సురేందర్ కు ప్రజల్లో మంచి సానుభూతి ఉంది. ఆయన నాలుగు సార్లు పోటీ చేసి ఓటమి మూట గట్టుకున్నారు. ఆ సానుభూతితో టిఆర్ఎస్ అభ్యర్థి రవీందర్ రెడ్డి నీ ఢీకొనే పరిస్థితులు ఉన్నాయి.
జిల్లాలో ఎస్సీ రిజర్వుడు స్థానమైన జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే అరుణతార తీవ్రంగా ప్రయత్నించారు. మరో మాజీ ఎమ్మెల్యే గంగారాం కే టికెట్ ఖరారు చేసింది. దీంతో నిరాశకు గురైన అరుణతార బీజేపీలో చేరారు. ఆమె బీజేపీ తరపున పోటీ చేయబోతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని భావించారు. టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గంగారాం ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి హనుమంత్ షిండే భారీ విజయం సాధించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ తిరుగుబాటు అభ్యర్థులతో ఓటమి చవిచూడాల్సి వస్తుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ుంది. దీనినే అవకాశంగా మార్చుకుని ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రస్ నాయకుల ఆశతో ఉన్నారు. కానీ రెబల్స్ మాత్రం.. వారిని ఆందోళనకు గురి చేస్తున్నారు.