కొత్త అధ్యక్షుడ్ని ఖరారు చేయకుండా ఉన్న అధ్యక్షుడ్ని ఉన్న పళంగా రాజీనామా చేయమనడానికి కారణాలేమిటి..?. ఒక్క రోజు ముందు మీడియా సమావేశం పెట్టి.. పార్టీ స్టాండ్ వినిపించిన అధ్యక్షుడు తర్వాతి రోజే ఎవరికీ తెలియకుండా రాజీనామా లేఖ పంపారనడం నమ్మశక్యమేనా..?. హరిబాబునే మళ్లీ అధ్యక్షునిగా కొనసాగించవచ్చు అంటూ.. ఎమ్మెల్సీ మాధవ్ లాంటి వాళ్ల వ్యాఖ్యలు.. అంతర్గత అలజడికి సంకేతం కాదా…? . ఏపీ బీజేపీలో అంతా ప్రశాంతమేనా..? లేక అతి సునామీ ముందటి ప్రశాంతతనా..?
ఏ రాజకీయ పార్టీ కూడా కారణాలు లేకుండా..ఓ రాష్ట్ర అధ్యక్షుడ్ని ఉన్న పళంగా రాజీనామా చేయమని కోరదు. అలా కోరిందంటే… చాలా .. చాలా సీరియస్ ఇష్యూలే ఉన్నాయని నమ్మాల్సి ఉంటుంది. అందులో అత్యంత కీలకమైనది .. ఆ పార్టీ అధ్యక్షుడు పార్టీ మారతాడనే అనుమానం ఉండటం. రెండోది.. పనితీరు బాగోలేకపోవడం. పనితీరు బాగోలేకపోతే… కొత్త అధ్యక్షుడ్ని నియమించిన తర్వాతే ఉద్వాసన పలుకుతారు కానీ.. ఉన్న పళంగా రాజీనామా లేఖ పంపేయమని ఎవరూ అడగరు. కానీ హరిబాబును తామే అడిగామని బీజేపీ హైకమాండ్ స్పష్టంగా చెప్పింది. ఇక హరిబాబు పార్టీ మారతారంటే.. ఎవరికీ నమశక్యం కాని విషయమే. సోషల్ మీడియాలో ఏవేవో ప్రచారాలు జరిగినా.. సిద్ధాంతపరంగా… బీజేపీతో సుదీర్ఘ కాలంగా అంటి పెట్టుకున్న వారు పార్టీ మారడం అసాధ్యమే.
కానీ నిప్పులేనిదే పొగరాదన్నట్లు.. కొన్ని కొన్ని పరిణామాలు… బీజేపీలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఎప్పుడూ లేని విధంగా.. హరిబాబుపై సానుభూతి చూపించారు. ఏపీకి .. కేంద్రం ఏమీ చేయడం లేదన్న కారణంగానే రాజీనామా చేశారని ఆయన తరపున వకాల్తూ పుచ్చుకుని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఎమ్మెల్సీ మాధవ్ లాంటి కొంత మంది బీజేపీ నేతలు..మళ్లీ హరిబాబునే అధ్యక్షునిగా కొనసాగించినా ఆశ్చర్యం లేదని ప్రకటించి… రాజకీయవర్గాల్లో మరింత ఆశ్చర్యం కలిగించారు. ఇక హరిబాబు రాజీనామా కాకతాళీయమేనని చెప్పేందుకు ఉత్సాహపడిన కొంత మంది నేతలు… కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే హరిబాబు స్వచ్చందంగా రాజీనామా చేశారంటూ చెప్పుకొస్తున్నారు. కొత్త అధ్యక్షుడ్ని నియమించాలనుకుంటే.. పాత అధ్యక్షుడు రాజీనామా చేయాలని బీజేపీ రాజ్యాంగంలో కూడా లేదు కదా..?
ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలు ఉన్నా లేకపోయినా… బీజేపీలో రెండు వర్గాలు ఎప్పుడూ ఉంటాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉంటారు. ఏపీలో ఎలాంటి హోప్స్ లేకపోవడం… రెండు వర్గాల కొట్లాటలతో.. ఏపీ బీజేపీని హైకమాండ్ కూడా పెద్దగా పట్టించుకోదు. కానీ ఇప్పుడు వ్యవహారం ముదిరి పాకాన పడినట్లయింది. కొత్త అధ్యక్షుడి ఎంపిక తర్వాత బీజేపీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలను కొట్టి పారేయలేం. ఒక్క సారి అధికారాన్ని రుచి చూసిన బీజేపీ నేతలు.. మళ్లీ మళ్లీ దాన్ని కోరుకోకుండా ఉండలేరు. అలాంటిది దొరకదని తెలిసిన మరుక్షణం… తమ దారి తాము చూసుకుంటారు. బీజేపీలోనూ అలాంటి సునామీ ఏదో కల్లోలం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.