ఆంధ్ర ప్రదేశ్. కొత్తగా విడిపోయిన పాత రాష్ట్రం. అనేక సమస్యలు.అమలు కాని ప్రత్యేక హౌదా ప్యాకేజీ సవాళ్లు. కేంద్రం ప్రకటించిన చాలా అంశాలు ఆచరణకు రావు.ఇలాటివన్నీ చూడటానికే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఒకరిని నియమించడం ఆనవాయితీగా వస్తున్నది. గతంలో ఎపికి మాజీ ఎంపి కంభంపాటి రామమోహనరావు, తెలంగాణకు మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి ప్రత్యేక ప్రతినిధులుగా వుండేవారు. ఇప్పుడు వేణుగోపాలాచారి కొనసాగుతున్నారు గాని కంభంపాటి ఆ బాధ్యతల్లో లేరు. మొదట ఇచ్చిన రెండేళ్ల పదవీ కాలం ముగిశాక కొనసాగింపు ఇవ్వకపోవడమే దీనికి కారణం. కంభంపాటికి ఢిల్లీలో బాగా సంబంధాలున్నాయి. అయితే తెలంగాణకు మంత్రి లేరు గనక ప్రతినిధి అవసరమనీ, ఇద్దరు మంత్రులున్న ఎపికి ఎందుకని సుజనాచౌదరి వర్గీయులు వాదించడం వల్లనే కంభంపాటిని మాన్పించారన్నది అందరికీ తెలుసు. సుజనా చౌదరి, అశోక్‌గజపతి రాజు మంత్రులైనా సరే కేంద్రానికి ప్రతినిధులే తప్ప ఎపి తరపున ప్రత్యేకంగా ఏమీ చేయడానికి వుండదు. చేసింది లేదు కూడా. ఇప్పుడు ప్రత్యేక హౌదా నిరాకరణ జరిగి ప్యాకేజీని కూడా మాయగా మార్చిన తర్వాత వెంటపడి సాధించుకోవలసింది చాలా వుంది.చట్టబద్దత అన్నది నినాదంగా మిగిలిపోయింది.ఇలాటి సమయంలో ఎంతో కొంత వెంటపడి ఎపి ఎజెండాను రంగం మీదకు తెచ్చే ప్రతినిధిని లేకుండా చేయడం ఆశ్చర్యమే. అయితే పదవి లేకున్నా కంభంపాటి తరచూ ఢిల్లీలో తను చేయగలిగింది చేస్తూనే వున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు, ఇటీవల ఎంఎల్‌సి నామినేషన్ల సందర్భంలో ఆయనకు కూడా ఒక స్థానం ఇవ్వాలన్న ప్రతిపాదన వస్తే రాజ్యసభ తప్ప మరేదీ తాను తీసుకోబోనని ఖరాఖండిగా చెప్పేశారట, స్వతహాగా వ్యాపారవేత్త అయిన ఆయన పెట్టుబడులను రాబట్టడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు కనిపిస్తుంది. తిరుపతిలో హీరో హౌండా విభాగంరావడం వెనక ప్రధాన పాత్ర తనదేనని తెలుస్తున్నది,