ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరును అద్భుతంగా పొడిగే భాజపా నాయకులు ఇద్దరే ఇద్దరు! ఒకరూ.. కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో వెంకయ్య నాయుడు. రెండూ.. రాష్ట్రంలో మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయిపోయారు కాబట్టి, ఆ స్థాయిలో చంద్రబాబు భజన చేసే అవకాశం ఇకపై ఉండకపోవచ్చు! అయితే, ఆలోటును కూడా భర్తీ చేసే రేంజిలో కామినేని భజన ఉంటోంది. అవకాశం దొరికితే చాలు చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. ‘ఈయన మన పార్టీ నాయకుడేనా’ అని భాజపా నేతలు సైతం అనుమానపడే స్థాయిలో ఆయన వ్యవహార శైలి ఉంటుంది. అయితే, ఇన్నాళ్లూ ఆయన తీరుపై భాజపా పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా భాజపా పెద్దలకు ఆగ్రహం తెప్పించే స్థాయిలో ఆయన బాబు భజన చేశారు! చంద్రబాబు గొప్పవారు అని పొడిగితే ఎవ్వరికీ నొప్పి ఉండేది కాదు. కానీ, ప్రధాని మోడీకి కంటే గొప్పవారు అని మాట్లాడితే భాజపా పెద్దలకు మండదా చెప్పండి..! ఇప్పుడు జరిగిందీ అదే!
ఇటీవలే విజయవాడలో ఇండో యూకే ఇన్ స్టిట్యూట్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ వేదిక మీద కామినేని చేసిన వ్యాఖ్యలు భాజపాలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును మెచ్చుకోవడం వరకూ బాగానే ఉంది. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్ల కూడా కాని పనుల్ని చంద్రబాబు చేస్తున్నారని కామినేని అన్నారు. యూకే సంస్థ అమరావతికి రావడం వెనక చంద్రబాబు కృషి చాలా ఉందని చెప్పారు. ఎంతగా అంటే… గతంలో ప్రధాని ఇంగ్లండ్ వెళ్లారనీ, విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధి కోసం ఆ దేశంతో చర్చలు జరిపారనీ, అప్పుడు అమరావతి ప్రస్థావన అస్సలు రాలేదని కామినేని చెప్పారు! ఆ తరువాత, చంద్రబాబు కృషి కారణంగానే యూకే సంస్థ రాష్ట్రానికి వచ్చింది అన్నారు. అంటే, ప్రధానికి మించిన కృషి చేయడం వల్లనే ఈ సంస్థ ఇండియాకి వచ్చిందని.. అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా సవివరంగా కామినేని ప్రసంగించారు. కేంద్రమంత్రులు కూడా ఉన్న ఆ వేదికపై కామినేని ఇలా ప్రసంగించడంపై భాజపా గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడం అనేది కామినేని కొత్త కాదు. ఏపీ భాజాపా నేతలకూ ఆ విషయం తెలియంది కాదు. ఇండో యూకే ఇన్ స్టిట్యూట్ రాష్ట్రానికి తీసుకుని రావడంలో చంద్రబాబు కృషి మెచ్చుకుని, అక్కడితో ఆగితే బాగుండేది. కానీ, ప్రధాని పర్యటనలో అమరావతి ప్రస్థావన లేదనీ, ఆయనకు చేతగాని పని చంద్రబాబు చేశారు అన్నట్టుగా వివరించాల్సిన అవసరం ఏమొచ్చిందనేది రాష్ట్ర భాజపా నేతల ఆగ్రహం! సందర్భం వచ్చింది కాబట్టి.. ఇదే వ్యవహారాన్ని భాజపా అధిష్ఠానానికి కూడా నివేదించినట్టు తెలుస్తోంది. గతంలో కూడా కామినేనిపై ఇలాంటి ఫిర్యాదులు చాలానే ఢిల్లీ వరకూ వెళ్లాయి. అయితే, అవన్నీ చంద్రబాబుపై పొగడ్తలు కాబట్టి వాటిని భాజపా కూడా లైట్ గా తీసుకుంటూ వచ్చిందని అనుకోవచ్చు. కానీ, ఇప్పుడు మోడీ కంటే చంద్రబాబు గొప్ప అనే స్థాయి వ్యాఖ్యలపై భాజపా స్పందన ఎలా ఉంటుందా అనేదే ఆసక్తికరం.