రాంగోపాల్ వర్మ కొత్త సినిమా `కమ్మరాజ్యంలో కడప రెడ్లు` విడుదలకు బ్రేక్ పడింది. ఈ సినిమా విడుదలని నిలిపివేయాలంటూ కొంతమంది హైకోర్టుని ఆశ్రయించారు. దానిపై కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. టైటిల్ అభ్యంతరకరంగా ఉందని హై కోర్టు కూడా అభిప్రాయ పడింది. రెండు కులాల మధ్య చిచ్చు రగిల్చేలా ఉందని తేల్చేసింది. దాంతో ఈ టైటిల్ని `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు`గా మార్చడానికి చిత్రబృందం అంగీకరించింది. ఈ సినిమాని సెన్సార్ బృందం వారం రోజుల్లోగా చూసి, సర్టిఫికెట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అభ్యంతరకరమైన సన్నివేశాలుంటే తొలగించాలని, ఎలాంటి వివాదాలూ తలెత్తకుండా చూడాలని, ఈ సినిమాపై ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా స్వీకరించాలని కోర్టు సూచించింది. నిజానికి శుక్రవారం విడుదల అవ్వాల్సిన సినిమా ఇది. ఇప్పటి వరకూ సెన్సార్ అవ్వలేదు. అంటే రేపు ఈ సినిమా రానట్టే. సెన్సార్ ఈ సినిమా చూడాలి, ఆ తరవాత అభ్యంతరాలు స్వీకరించాలి, దానికి తగ్గట్టు రీ ఎడిట్ చేయాలి.. ఇంకా చాలా పనుందన్నమాట. ఇన్నిసార్లు కత్తిర పడితే – మసాలా బాగా తగ్గిపోయే అవకాశం ఉంది.