ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, సస్పెన్స్ సినిమాలకు ఓ సమస్య ఉంది. ఎవరైనా సరే, చిక్కుముడులు ఈజీగా వేసేస్తారు. వాటిని విప్పడం దగ్గరే చాలామంది తడబడుతుంటారు. అందుకే కథలుగా ఆసక్తిరేకెత్తించే కొన్ని సినిమాలు.. తెరపైకొచ్చేసరికి బోల్తా పడుతుంటాయి. `కనబడుటలేదు` కూడా సస్పెన్స్ థ్రిల్లరే. ఇన్వెస్టిగేషన్ కథే. ఇందులోనూ ముడులు, మలుపులూ ఉన్నాయి. మరి.. వాటిని చెప్పడంలోనూ, విప్పడంలోనూ దర్శకుడి ప్రతిభ ఎంత మేర కనిపించింది. డిటెక్టీవ్ గా కొత్త తరహా పాత్రలో సునీల్ ఎంత వరకూ ఆకట్టుకున్నాడు?
నగర శివార్లలోని డంప్ యార్ట్ లో ఓ గుర్తు పట్టలేని శవం దొరుకుతుంది. ఈ కేసుని విక్టర్ రాజు అనే సీఐ దర్యాప్తు చేస్తుంటాడు. సడన్ గా… తనని కూడా ఎవరో చంపేస్తారు. మరోవైపు… ఆదిత్య, శశితలకు పెళ్లవుతుంది. శశిత ఆదిత్యకు దూరంగా ఉంటుంది. కారణం.. తాను ఇదివరకు సూర్య అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. తను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేస్తాడు. అందుకే సూర్యపై పగ పెంచుకుంటుంది. `సూర్యని చంపుతావా` అని తన భర్తని తొలిసారి ఓ కోరిక కోరుతుంది. అందుకే… ఆదిత్య, శశిత సూర్యని వెదుకుతుంటారు. అయితే ఆ సూర్య కనిపించకుండా పోతాడు. సీఐ అన్వేషిస్తున్న అనాథ శవం కేసుకీ, సూర్యకీ ఏమైనా ముడి ఉందా? సూర్య కనిపించకుండా పోయాడా, ఎవరైనా చంపేశారా? విక్టర్ రాజు ని ఎవరు చంపారు? ఈ ప్రశ్నలకు సమాధానం.. కనబడుటలేదు.
ఈ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు ఓ జిమ్మిక్ చేశారు. టీజర్, ట్రైలర్లలో… సునీల్ ని హైలెట్ చేసి, ఇది సునీల్ సినిమా అనే భ్రమ కల్పించి – సునీల్ ని తొలి సగంలో ఎక్కడా కనిపించకుండా చేశారు. నిజం.. ఫస్టాఫ్ లో చూడాలనుకున్నా సునీల్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో కూడా కనిపించదు. తన ఎంట్రీ సెకండాఫ్ లోనే. అయితే అక్కడ వరకూ కథని లాక్కురావడానికి దర్శకుడు నానా తంటాలూ పడ్డాడు. అనాథ శవం దగ్గర్నుంచి కథ ఆసక్తిగానే మొదలైనా, ఆ శవం తాలుకా ఇన్వెస్టిగేషన్ చాలా నీరసంగా సాగుతుంది. ఆదిత్య, శశితల ఎపిసోడ్ అయితే… సీరియల్ స్టైల్. సూర్య – శశితల ప్రేమకథ.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లూ ఏమాత్రం పండలేదు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో ప్రేక్షకులు ఎదురు చూసేది మలుపుల గురించీ, ఆ ఇన్వెస్టిగేషన్ జరిగే పద్ధతి గురించి. ఇవి గ్రిప్పింగ్ గా సాగాలి. మిగిలిన సన్నివేశాలు క్రిస్పీగా ఉండాలి. ఈ సినిమాలో ఇది రివర్స్ అయ్యింది. విక్టర్ రాజు మర్డర్ తో కథకు ఇంట్రవెల్ కార్డు పడుతుంది. అప్పటి వరకూ సినిమాని ఐదంటే ఐదు నిమిషాలు భరించడం కూడా కష్టమే. ఈలోగా రెండు పాటలు ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారతాయి.
ద్వితీయార్థంలో సునీల్ ఎంట్రీ ఇస్తాడు. `ఇక్కడ్నుంచి చూసుకో.. నా సామిరంగా` అన్నట్టు ప్రేక్షకుడు ఫీలవ్వాలి అన్నది దర్శకుడి ఉద్దేశ్యం. అయితే అప్పటికే రావాల్సిన నీరసాలు వచ్చేస్తాయి. కాస్తలో కాస్త… ఈ సినిమాని కాపాడిన ఎలిమెంట్ సునీల్ మాత్రమే. సునీల్ వచ్చాక.. కాస్త చలనం వస్తుంది. అయితే మరీ పేషెంట్ ని బతికించేసే రేంజులో కాదు. జస్ట్.. థియేటర్ల నుంచి బయటకు వెళ్లిపోవాలన్న చికాకుని.. కాసేపు హోల్డ్ చేస్తాడంతే. సినిమాలోని కొన్ని పాత్రలపై అనుమానం కలిగించేలా చేసి, వాళ్లెవరూ దోషులు కారంటూ కొత్త పాత్ర ప్రవేశ పెట్టి – సస్పెన్స్ ముడి విప్పేయడం చాలా పాత ఫార్ములా. ఇక్కడా అదే కనిపిస్తుంది. అప్పటి వరకూ ప్రేక్షకుల మైండ్ లో లేని పాత్రని సడన్ గా హైలెట్ చేస్తూ.. `ఇదిగో నేరస్థుడు` అనేయడం ఈ సినిమాలోనూ కనిపించింది. అయితే ఇన్వెస్టిగేషన్ అక్కడికి చేరడానికి దర్శకుడు చూపించిన తెలివితేటలేం కనిపించవు. సెకండాఫ్ లో ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ కూడా చాలా సాదా సాదాగా, ప్రేక్షకుడి అంచనాలకు అతి దగ్గరగా సాగుతాయి. పతాక సన్నివేశాల్లో ఆ సైకో ఎవరో తెలిసేసరికి.. ప్రేక్షకులు నిర్ఘాంతపోయి – `ఇక చాల్లేరా బాబూ` అనుకుంటూ థియేటర్ల నుంచి బయటపడతారు.
ముందే చెప్పినట్టు ఇది సునీల్ సినిమా కాదు. ఆయన ఓ పాత్ర మాత్రమే చేశాడు. తన పాత్రనే హైలెట్ చేయడం వల్ల ఇది సునీల్ సినిమా అనే భ్రమ కలుగుతుంది. సునీల్ ఈ టైపు పాత్ర చేయడం కొత్త కాబట్టి.. తను కూడా కొత్త డైలాగ్ మాడ్యులేషన్ ట్రై చేశాడు కాబట్టి ఓకే అనిపిస్తుంది. ఇద్దరు హీరోలూ చూడ్డానికి సోసోగానే ఉంటే, హీరోయిన్ కంటే, తన స్నేహితురాలే అందంగా ఉందనుకుంటే, ఆ తప్పు ప్రేక్షకులది కాదు.
సాంకేతికంగా చూస్తే – బడ్జెట్ లోటు పాట్లు తెరపై కనిపిస్తాయి. తక్కువ బడ్జెట్లో ముగించాలన్న నిర్మాతల తపనని అర్థం చేసుకుని, ఈ సినిమాని వీలైనంత తక్కువ క్వాలిటీలో లాగించేశాడు దర్శకుడు. సెల్ ఫోన్, సోషల్ మీడియా గోలలో పడిపోవద్దని సందేశం ఇస్తూ పబ్ లో ఓ పాట తీశారు. సందేశం బాగానే ఉన్నా, ఆ పాట ఈ సినిమాకి ఎంత వరకూ కరెక్ట్ అన్నది సందేహం. కొన్ని డైలాగులు బాగానే ఉన్నా – అప్పటి సెట్యువేషన్ ని దాటుకుని మరీ వెళ్లి రాసినట్టు అనిపిస్తుంది. తీరా చూస్తే 2 గంటల లోపు ఉన్న సినిమా ఇది. కానీ 4 గంటలు ఏక ధాటిగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఫినిషింగ్ టచ్: మలుపులు `కనిపించలేదు`
రేటింగ్: 1.5