లాక్డౌన్లో రిస్క్ తీసుకుని మరీ చెన్నై నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న కనగరాజ్‌కు ఇప్పుడు ఆ పదవీ దక్కలేదు. పైగా.. లక్షలకు లక్షలు ఖర్చయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆయన ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టగానే విజయవాడలో బెంజ్ సర్కిల్‌కు సమీపంలోనే ఓ అపార్టుమెంట్లో లగ్జరీ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. దానికి దాదాపుగా రూ. లక్షా ఇరవై వేల రెంట్. మామూలుగా అయితే.. ఆయన వ్యక్తిగతంగా అంత సొమ్ము చెల్లించడానికి సిద్ధపడరేమో.. కానీ ఎస్ఈసీ కాబట్టి..ఆయన అకామిడేషన్ జనం సొమ్ముతో ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి… అంత లగ్జరీ ఫ్లాట్ తీసుకున్నారు. దానికి పంచాయతీరాజ్ అధికారులు సహకరించారు. కావాల్సినంత ఫర్నీచర్‌ను కూడా తెచ్చి పెట్టారు. అయితే.. తర్వాత సీన్ మారిపోయింది.
కనగరాజ్ చెన్నై వెళ్లిపోయారు. మళ్లీ రాలేదు. ఈ లోపు కోర్టుల్లో కేసులు పడ్డాయి. ఆయన నియామకం చెల్లదని న్యాయస్థానాలు చెప్పేశాయి. దాంతో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ పదవి చేపట్టారు. అయితే.. ఇక్కడ ఫ్లాట్ మాత్రం.. కనగరాజ్ ఖాతాలోనే ఉండిపోయింది. ఆయన పదవి చేపట్టడం చెల్లదు కాబట్టి.. ప్రభుత్వం తరపున ఆయన ఫ్లాట్‌కు రెంట్ చెల్లించే ప్రసక్తే ఉండదు. ఏ ఖాతాలోనూ అలా చెల్లించడం సాధ్యం కాదు. ఆయనకు అకామిడేషన్ చట్ట విరుద్ధంగా కల్పించినట్లే అవుతుంది. అందుకే.. పంచాయతీరాజ్ అధికారులు ఆయన ఫ్లాట్‌ను ఖాళీ చేసేందుకు ప్రయత్నించారు. ఫర్నీచర్‌ను తీసుకెళ్లేందుకు పోలీసులతో వచ్చారు. కానీ.. తన రెంట్ సంగతి తేల్చిన తర్వాతనే ఫర్నీచర్ తీసుకెళ్లాలని.. ఇంటి యజమాని తేల్చిచెప్పారు.
అయితే పోలీసులు ఇంటి ఓనర్‌పై కేసు పెట్టి బెదిరించి… ఆ ఇల్లు ఖాళీ చేద్దామనుకున్నారు కానీ.. ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆస్పత్రిలో ఉన్నప్పటికీ.. ఆయన నేరుగా అపార్టుమెంట్ వచ్చేసి.. పోలీసులతో తన వాదన వినిపించారు. లిఖితపూర్వకంగా రాసిచ్చి ఫర్నీచర్ తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే.. నేడో .. రేపో.. మరికొంత మందిపోలీసుల్ని తీసుకొచ్చి బలవంతంగాఫర్నీచర్ను తీసుకెళ్లడమో.. మరొకటో చేస్తారు. యజమానికి కోర్టుకెళ్తారు. కానీ.. అసలు న్యాయమూర్తిగా పని చేసిన కనగరాజ్ అనే ఉన్నత స్థాయి వ్యక్తి ఇలా చేయడం ఏమిటన్నది చాలా మందిని ఆశ్చర్య పరిచే అంశం.