వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న దుర్గ గుడి ఫ్లైఓవర్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. కరోనా నుంచి కోలుకున్న నితిన్ గడ్కరీ.. వర్చువల్ విధానంలో ఈ వంతెనను ప్రారంభించారు. కొద్ది రోజులుగా ఈ ఫ్లైఓవర్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. పధ్నాలుగునెలల్లో పూర్తి చేశామని వైసీపీ సర్కార్ ప్రకటించుకుంది. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడిన పధ్నాలుగు నెలల కాలంలో ఫినిషింగ్ వర్క్ చేశారు. మూడు నెలల్లో పూర్తి చేయాల్సిన ఫనిషింగ్ వర్క్.. ఇసుక కొరత.. లాక్ డౌన్ వంటి వాటి వల్ల ఆలస్యం అయింది. అయితే ఫ్లైఓవర్ మొత్తం తామే కట్టామని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్రానికి సంబంధం లేకుండా ముఖ్యమంత్రితోనే ఓపెనింగ్ చేయించాలని ఓ సందర్భంలో నిర్ణయించారు. కానీ ఎంపీ కేశినేని నాని కేంద్రమంత్రి గడ్కరీతో మాట్లాడి.. ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు.
దుర్గగుడి ఫ్లైఓవర్ నిధులన్నీ కేంద్రానివే. భూసేకరణ మాత్రం చంద్రబాబు హయాంలో జరిగింది. విజయవాడ-మచిలీపట్నం రహదారి విస్తరణలో భాగంగా బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ను కూడా కేంద్రం గతంలోనే మంజూరు చేసింది. బెంజ్ సర్కిల్ లో రెండోవైపు ఫ్లై ఓవర్ కోసం టెండర్లను సైతం పిలిచారు. విజయవాడకు బైపాస్ రోడ్ కోసం కేంద్రం నిధులిచ్చింది.ఈ ఫ్లై ఓవర్ల ప్రారంభోత్సవం, బెంజ్ సర్కిల్ లో రెండో ఫ్లై ఓవర్ కు శంకుస్థాపన గడ్కరీ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ పద్దతిలో జగన్ కూడా పాల్గొన్నారు. గడ్కరీ దాదాపుగా రూ. పదిహేను వేల కోట్ల విలవైన పనులకు కూడా శంకుస్థాపన చేశారు.
విజయవాడ ట్రాఫిక్ చిక్కుల్లో ఉన్నప్పటికీ.. రెడీ అయిన ఈ ఫ్లైఓవర్‌పై ప్రభుత్వం వాహనాల రాకపోకలకు అనుమతించలేదు. ప్రారంభోత్సవం తర్వాతే అనుమతిస్తామని పట్టుబట్టింది. చివరికి గడ్కరీ కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్రారంభోత్సవం చేశారు. ఈ ఫ్లైఓవర్‌తో.. విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తీరే అవకాశం ఉంది. అత్యాధునిక టెక్నాలజీతో 2.6 కిలోమీటర్ల పొడువున ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు.