ప్రముఖ రచయిత మరియు దళిత నేత కంచె ఐలయ్య భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని మరియు హోం మంత్రి అయిన స్వర్గీయ సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. న్యూ డిల్లీలో జరిగిన టైమ్స్ లిట్ ఫెస్టివల్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ “హిందు సంస్కృతిని, మనుస్మృతిని బలంగా విశ్వసించే సర్దార్ పటేల్ ఒకవేళ ప్రధాని అయ్యుంటే, భారత్ కూడా పాకిస్తాన్ లాగే మతతత్వదేశంగా మారి ఉండేది. ఒకవేళ ఆయన ప్రధాని అయ్యుంటే డా.అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యంగాన్ని కూడా వ్రాయనిచ్చేవారు కారు. దేశంలో ఇంత బలమయిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడేదే కాదు,” అని అన్నారు.
ఈరోజుల్లో సామాన్యుల వలన కంటే మేధావులు చేస్తున్న ఇటువంటి వివాదస్పద వ్యాఖ్యల వలననే దేశంలో ఊహించని సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మేధావులకి చాలా విషయాలపై సమగ్రమయిన అవగాహన, నిశ్చితాభిప్రాయాలు ఉండవచ్చును. కానీ తమ గొప్పదనాన్ని చాటుకొనేందుకు ఎప్పుడో చనిపోయినవారి ఆలోచనా విధానం గురించి కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేసి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ అవసరం లేని విషయాలలో తమ మేధస్సును ప్రదర్శిస్తుంటారు. దేశప్రజల దృష్టిలో సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ కున్న గొప్ప గౌరవం గురించి తెలిసి కూడా ఆయన ఈవిధంగా మాట్లాడటం సబబు కాదు. ఒకవేళ మాట్లాడినా దాని వలన ఒరిగేదేమీ ఉండదు విమర్శలు మూటగట్టుకోవడం తప్ప.