హైదరాబాద్ ఐఐటీ ఉన్న కంది గ్రామం గురించి చాలా మందికి తెలియదు. కానీ ఐఐటీ గురించి అందరికీ తెలుసు. ఐఐటీని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా రియల్ వెంచర్లతో నిండిపోయింది. కంది గ్రామం ఇప్పుడు స్థలాలు కొనాలనుకునేవారికి హాట్ ప్రాపర్టీగా మారిపోయింది. పటాన్ చెరు దాటిన తర్వాత సంగారెడ్డి కంటే ముందే కంది గ్రామం వస్తుంది. హైవే పక్కనే ఉండటంతో భవిష్యత్లో మంచి రిటర్న్స్ ఉంటాయని గత పదేళ్లుగా అక్కడ స్థలాలు కొనేవారు పెరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం రవాణా సౌకర్యాలు వివిధ రూపాల్లో మెరుగుపడే అవకాశాలు కనిపిస్తూండటంతో డిమాండ్ పెరిగింది.
రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదన తర్వాత ఒక్క సారిగా డిమాండ్ పెరిగింది. ఎకరాల్లో కొనేవారు కూడా ఎంక్వయిరీలు చేస్తున్నారని స్థానిక బ్రోకర్లు చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణాలు కూడా పెరిగాయి. సౌకర్యాలు కల్పిస్తే మరింతగా ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. పదేళ్ల కిందట వేసిన వెంచర్లలో ఇప్పుడు లావాదేవీలు పెరుగుతున్నాయి. అప్పట్లో కొని పెట్టుకున్న వారు ఇప్పుడు లాభానికి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్ లో లాభాలు వస్తాయని ఇప్పుడు కొనేవారు పెరిగారు.
హైదరాబాద్ నగరం ఊహించనంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం సమయంలో… అంత దూరం సిటీ ఎప్పుడు అభివృద్ధి చెందాలి అనుకున్నారు. ఇప్పుడు ఔటర్ దాటిపోయి నగరం విస్తరిస్తోంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ విషయంలోనూ అలాగే జరుగుతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ప్రస్తుతం కంది వద్ద స్థలాలు గరిష్ట ధరను పలుకుతున్నాయి. కొన్నిచోట్ల గజం ముఫ్పైవేల వరకూ ఉంది. కాస్త ఎక్కువే అనిపించినా భవిష్యత్ లో పెరిగేదానితో పోలిస్తే … లాభమేనని అనుకుంటున్నారు.