‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర’.. ‘టెంపర్’లో ఎన్టీఆర్ చేత పూరి జగన్నాథ్ చెప్పించిన డైలాగ్. ‘మణికర్ణిక’ వివాదంలో అటువంటి దండయాత్ర ఒకటి జరిగింది. తాజాగా మరో దండయాత్ర మొదలైంది. మొదటి దండయాత్ర దర్శకుడు క్రిష్‌ది అయితే… తాజా దండయాత్ర కంగనా రనౌత్‌ది.
‘మణికర్ణిక’ విడుదలైన తరవాత క్రిష్ మీడియా ముందుకు వచ్చారు. కంగనా రనౌత్ చిత్రాన్ని నాశనం చేసిందన్నట్టు మాట్లాడారు. గ్యాప్ లేకుండా బాలీవుడ్లో ప్రతి మీడియా హౌస్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. క్రిష్‌కి కవరేజ్ బాగా దక్కింది. ఇంటర్వ్యూలతో కంగనపై దండయాత్ర చేశారు. క్రిష్ వైఖరిని కంగనా రనౌత్ సోదరి రంగోలి, నిర్మాత కమల్ జైన్ తప్పుబట్టారు. రంగోలికి క్రిష్ ట్వీట్స్‌తో సమాధానం చెప్పారు. ఎవరు ఏమన్నా క్రిష్ నుంచి కౌంటర్ వచ్చేది. ఇప్పుడు అదంతా గతం. వర్తమానంలో కంగనా రనౌత్ దండయాత్ర మాత్రమే కనబడుతోంది.
క్రిష్ ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కంగనా రనౌత్ లండన్‌లో వుంది. ఆమె తిరిగొచ్చాక తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెబుతోంది. క్రిష్ ఇచ్చినట్టు వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. మా పాత్రలు నిడివి తగ్గించారని గగ్గోలు పెట్టిన వారందరికీ గట్టి సమాధానం చెప్పింది. సోనూ సూద్‌కి సినిమా గురించి మాట్లాడే అర్హత లేదని తేల్చింది. ప్రత్యర్థులపై దండయాత్ర చేస్తోంది. విచిత్రంగా కంగనా రనౌత్ సీన్లోకి ఎంటరయ్యాక.. క్రిష్ సైలెంట్ అయ్యారు. ఎన్టీఆర్ మహానాయకుడు షూటింగుతో బిజీ కావడంతో మీడియాలో కనిపించడం లేదు. ఎన్ని పనులున్నప్పటికీ కౌంటర్ ఎటాక్ ఇవ్వకపోతే ఎలా? కనీస స్పందన ఇవ్వాలి. లేకపోతే కంగనాకు భయపడినట్టు వుంటుంది.