బాలీవుడ్ క్వీన్… కంగనా రనౌత్. గ్లామరెస్ హీరోయిన్గా చేసినంత కాలం చేసి, ఆ వెంటనే లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు షిఫ్ట్ అయిపోయింది. అక్కడా తన ప్రతిభ చాటుకొని బాలీవుడ్లో ఉత్తమ కథానాయికల జాబితాలో చేరింది. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న మణికర్ణికలో తనే టైటిల్ రోల్ పోషిస్తోంది. అయితే మణికర్ణికతో నటనకు గుడ్ బాయ్ చెప్పాలని కంగనా భావిస్తోంది. ఈ సినిమా అవ్వగానే తాను మెగాఫోన్ పట్టబోతోంది. దర్శకత్వం వహించాలన్నది కంగనా ఆశయం. అందుకోసం ఎప్పటి నుంచో ప్రణాళికలు వేసుకొంటోంది. మణికర్ణిక తరవాత నటనకు దూరంగా ఉండి.. సినిమాలు చేసుకోవాలని, ప్రొడక్షన్ కూడా మొదలెట్టాలని చూస్తోంది. ”బహుశా.. నటిగా నా చివరి చిత్రం ఇదే కావొచ్చు. ఇకపై దర్శకురాలిగా నిరూపించుకోవాలని ఉంది. దర్శకత్వం కూడా బోర్ కొట్టిన తరవాత నటన గురించి ఆలోచిస్తా” అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది కంగనా! ఇంతటి ప్రతిభావంతురాలైన నటి.. నటనకు దూరం అవుతానంటే.. దర్శకులకు ఇబ్బందే. కంగనాని దృష్టిలో ఉంచుకొని పుట్టుకొచ్చే కథలు ఇక ఏమైపోవాలి? ఏదేమైనా కంగనా తన నిర్ణయాన్ని మార్చుకొంటే మంచిదేమో..?? ఒకవేళ దర్శకురాలిగా మారినా.. అప్పుడుప్పుడూ వెండి తెరపై కనిపిస్తే బాగుంటుంది.