వెండి తెర ధోనీ.. సుశాంత్ సింగ్ రాజ్పుట్ ఆత్మహత్యని బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. సుశాంత్ చాలా తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడని కొందరు సానుభూతి చూపిస్తుంటే, సుశాంత్ ది ముమ్మాటికీ హత్యే అని ఇంకొంతమంది సందేహ పడుతున్నారు. అయితే ఓ వర్గం మాత్రం బాలీవుడ్‌లోని కొంతమంది సుశాంత్ ప్రతిభను గుర్తించలేదని, తనని ప్రోత్సహించలేదని, అదే కృంగుబాటుకి దారితీసిందని కొత్త కారణాల్ని విశ్లేషిస్తున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌట్ కూడా ఈ మాటే చెబుతోంది. సుశాంత్ సింగ్ ని ఎవరూ ప్రోత్సహించలేదని, తొలి సినిమా `కాయ్ పోచీ` చేసినప్పుడు ఏ ఒక్క స్టార్ తనని అభినందించలేదని, చిచోరేని పట్టించుకోని జనం.. గల్లీబాయ్స్ లాంటి భయంకరమైన సినిమాలకు అవార్డులు కట్టబెట్టారని సంచలన వ్యాఖ్యలు చేసింది. పాత్రికేయులు కూడా కొంతమంది విషయంలో పక్షపాతం చూపిస్తారని, సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటే.. డ్రగ్స్ తీసుకున్నాడన్న కథనాలు ప్రచురిస్తోందని, వాళ్లందరికీ సంజయ్ దత్ డ్రగ్స్ తీసుకోవడం మాత్రం అందంగా కనిపిస్తుందని సెటైర్లు వేసింది. తన విషయంలోనూ ఇలాంటి అసమానతలే చూపించారని, తన హిట్స్‌ని ఎవరూ పట్టించుకోలేదని, తనని కూడా ఎవ్వరూ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మాజీ హీరోయిన్ ఊర్మిళ కూడా దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో బంధుప్రీతి ఎక్కువని, అందుకే సుశాంత్ లాంటి ప్రతిభావంతుల్ని గుర్తించరని కుండ బద్దలు కొట్టేసింది. మొత్తానికి సుశాంత్ మరణం.. బాలీవుడ్ లో ఓ కొత్త చర్చకు తెర లేపింది. అక్కడ కుటుంబాలు, కోటరీలను ప్రశ్నించే గొంతులు ఇప్పుడిప్పుడే పుడుతున్నాయి. ఈ ప్రశ్నలకు స్టార్ హీరోలేమైనా సమాధానం చెబుతారేమో చూడాలి.