Kanguva Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2/5
-అన్వర్-
ఈమధ్య కాలంలో కేవలం ట్రైలర్ తోనే విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన సినిమా సూర్య కంగువా. కచ్చితంగా సినిమాని థియేటర్లో చూసి తీరాలనే ఉత్సుకతని రేపింది. బిజినెస్ కూడా అలానే జరిగింది. అటు సూర్య కూడా సినిమాని తెగ ప్రమోట్ చేశాడు. ప్రేక్షకులకు మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నాం అన్నాడు. మరి ఇంత ఆసక్తిని పెంచిన కంగువాలో వున్న కథ ఏమిటి? కంగువాగా సూర్య అంచనాలు అందుకున్నాడా?
కొన్ని వందల ఏళ్ళ క్రితం సుముద్రాన్ని అనుకొని వున్న పంచమ దీవి. ఆ దీవిలో ఐదు కోనలు. ఒకొక్క కోనకి ఒక్కో పాలకుడు. ప్రణవ కోనకి కంగువా (సూర్య) పాలకుడు. చాలా గొప్ప వీరుడు. కపాల కోన బాబిడియోల్ అధీనంలో వుంటుంది. తనో నరరూప రాక్షసుడు. సముద్రం మీదుగా ఆ ప్రాంతానికి వచ్చిన రోమన్ చక్రవర్తి ప్రణవ కోనపై కన్నేస్తాడు. ఐదు కోనల మధ్య అంతర్యుద్ధం వచ్చేలా పన్నాగం పన్నుతాడు. యుద్ధం తప్పితే మరో ఎమోషన్ లేని ఆ కోనల ప్రజలు తమలో తామే కొట్టుకు చావడానికి సిద్ధం అవుతాయి. ఇందులో ప్రణవ కోన, హిమ కోన ఒక పక్షం. మిగిలిన మూడు కోనలు మరో పక్షం. అయితే యుద్ధం సమీపంలో ఉండగా పలోమా అనే ఓ చిన్నపిల్లాడి కోసం.. ప్రణవ కోనని వదిలి చీకటి కోన అనే చోటుకి వెళ్లిపోతాడు కంగువా. ఇంతకీ ఈ పలోమా ఎవరు? అతని కోసం కంగువా ఎందుకు రాజ్యాన్ని విడిచాడు? మొత్తం ప్రణవ కోన జాతిని అంతం చేయడానికి వచ్చిన కపాల కోన నాయకుడు బాబీ డియోల్ లక్ష్యం నెరవేరిందా? తమ జాతిని రక్షించడానికి కంగువా రణ రంగంలో దిగాడా లేదా? ఈ తాతల నాటి కథకి, 2024లో జర్మనీ జరుగుతున్న ఓ ప్రయోగానికి లింక్ ఏమిటి? ఇవన్నీ తెరపై చూడాలి.
కొన్ని కథలు ఐడియాగా వున్నప్పుడు బావుంటాయి. ఇంకొన్ని కథలు పేపర్ మీద పెట్టినప్పుడు ఉత్సాహన్ని రేపుతాయి. కంగువా ఈ రెండో రకం కథ. చందమామ కథ లాంటి సెటప్, ఐదు కోనలు, ఆ ప్రాంతని వచ్చిన ఓ విదేశీ చక్రవర్తి, వాళ్ళ మధ్య యుద్ధాలు, పునర్జన్మ, మెదడుపై ప్రయోగాలు…అబ్బో ఈ కథ పేపర్ మీద మామూలుగా వుండదు. అయితే పేపర్ మీద వున్న కథని స్క్రీన్ మీదకి తీసుకురావడంలోనే అసలు పనితనం వుంది. ఈ విషయంలో కంగువా పెద్ద దెబ్బకొట్టేసింది. రీళ్లకి రీళ్ళు గడిచిపోతుంటాయి. యుద్ధాలు జరిగిపోతుంటారు దానికి తగ్గట్టుగానే నెత్తురు ఏరులైపారుతుంటుంది. శవాలు కుప్పల్లా పేరుకుపొతుంటాయి. కానీ ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా కదిలించేలా వుండదు. ప్రేక్షకుడి పట్టుకొని నడిపించే ఒక్క పాత్ర కనిపించదు. అంత ఎమోషన్ లెస్ కంగువాని తయారు చేశారు.
పూర్వం ప్రణవ కోనలో ఓ బామ్మ పిల్లలకు చందమామ సాక్షిగా చెప్పే కథతో కంగువా ప్రయాణం మొదలౌతుంది. కట్ చేస్తే.. ప్రస్తుత కాలంలో నడిపిన ఫ్రాన్సిస్ (సూర్య) ట్రాక్ పరమ అధ్వానంగా తెరపైకి వచ్చింది. సూర్య లాంటి నటుడిని పట్టుకొని ఏ మాత్రం బలం లేని ఆ పాత్ర చిత్రీకరణ, రచన విధానం నిజంగా ప్రేక్షకుడు ఖంగుతినేలా వుంటుంది. ఒక లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ని చెప్పినప్పుడు ఎంత పటిష్టంగా రాయాలి? సన్నివేశాల్లో ఎంత క్రియేటివిటీ వుండాలి? ఇలాంటి బేసిక్స్ చెక్ చేసుకోకుండా ఏదితోస్తే అది రాసి తీసినట్లుగా వుంది. దీనికి తోడు దిశాపటానీ ట్రాక్ మరింత విసిగించేసింది. ప్రయోగశాల నుంచి తప్పించుకొని బయటపడిన పిల్లాడు, ఫ్రాన్సిస్ కలిసే తీరుని తీర్చిదిద్దిన విధానం ఐతే క్లూ లెస్ గా వుంటుంది. పునర్జన్మ ఫ్యాక్టర్ ని కూడా చాలా స్వేచ్ఛగా వాడేశారు. ఆ పిల్లాడు, ఫ్రాన్సిన్స్.. కంగువా కథలోకి వెళ్ళే విధానం ఫోర్స్ గా అనిపిస్తుంది.
అసలు కథ కంగువాదే కదా, అది బావుంటే చాలనే ఆడియన్స్ కి కంగువా ఖంగు తినపించడానికి పెద్ద సమయం పట్టదు. ఏడాది సిలబస్ ని పరీక్షకి వెళ్ళే నిమిషం ముందు చదివినట్లు ఆ ఐదు కోనల కథని ఒక హిస్టరీ లెసన్ లా అప్పగిస్తారు. అది రిజిస్టర్ కూడా కాదు. కంగువా పాత్ర ఎంటరైన తర్వాత ఒకటే గోల. ప్రతి క్యారెక్టర్, ప్రతి డైలాగ్ ని బిగ్గరగా అరుస్తూ చెబుతుంటారు. ఇంటర్వెల్ వరకూ ఇందులో కాన్ఫ్లిక్ట్ పాయింట్ రిజిస్టర్ కాదు. నమ్మక ద్రోహం కోణంలో వచ్చే ఓ పాత చింతకాయ పచ్చడి లాంటి సంఘర్షణతోనే విరామం ప్రకటిస్తారు.
సెకండ్ హాఫ్ లో పిల్లాడి ఎమోషన్ ని బలంగా నమ్మారు. నిజంగా డీప్ గా ఆలోచిస్తే మనిషి పరిణామ క్రమంలో ఎమోషన్ ఎన్నో దశలు దాటి పరివర్తనం చెందివుంటుంది. రాతి యుగం నాటి మనిషి, ఆధునిక మానవుడిగా మారడానికి ఎన్నో యుగాలు పట్టింది. ప్రణవ కోన జాతిలో కంగువా మానవత్వాన్ని గుర్తిస్తాడు. మాట మీద నిలబడతాడు. కంగువా కథ ఎమోషనల్ త్రెడ్ ఇదే. కానీ ఈ ఎమోషన్ తో ప్రేక్షకుడిని హత్తుకునేలా చేయలేకపోయాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ అంతా దాదాపు యుద్ధమే. ఐతే ఆ యుద్ధం అంతా చాలా భారంగా సాగుతుంది. గతానికి, వర్తమానాని ముడిపెట్టి నడిపిన క్లైమాక్స్ సీక్వెన్స్ లో రిచ్ నెస్ కనిపిస్తూ దాన్ని ఆస్వాదించేలా చిత్రీకరణ వుండదు.
మరి కంగువా చెప్పుకోదగ్గ అంశాలే లేవా? అంటే వున్నాయి. భారీ కాన్వాస్ లో తీసిన సినిమా ఇది. వరల్డ్ బిల్డింగ్, ప్రొడక్షన్ డిజైన్, వార్ సీక్వెన్స్ లు. గ్రాఫిక్స్.. ఇలా అన్నిట్లో భారీతనం కనిపిస్తుంది. సినిమాకి విచ్ఛల విడిగా ఖర్చు చేశారు. అది స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. మొసలితో చేసిన ఫైట్, హిమకోన లో అమ్మాయిలు చేసిన వార్, క్లైమాక్స్ ఎయిర్ యాక్షన్, ఆయుధపూజ పాట.. ప్రత్యేకంగా చెప్పుకునేలా వుంటాయి. అయితే ఇంత విజువల్ ఎక్స్పీరియన్స్ ని ముడి కట్టి ముందుకు నడిపించే కథ, కథనాలు ఈ సినిమాలో లేకపోవడం ప్రధానమైన లోపం.
సూర్య మంచి నటుడు. కంగువా మొత్తం ఆయన భుజాలపైనే ఉంటుంది. ఎమోషన్ సీన్స్ లో తన నటన ప్రత్యేకం. అయితే ఇందులో సూర్య పాత్రని మరీ లౌడ్ గా డిజైన్ చేశారు. ఒకటే మూసలో డైలాగులు చెబుతూ ఒకటే ఎక్స్ ప్రెషన్ కంటిన్యూ చేస్తుంటాడు. నిజానికి గొప్పగా నటించే అవకాశం ఇవ్వని స్క్రిప్ట్ ఇది. ఫ్రాన్సిస్ లుక్ మోడరన్, కూల్ గా వుంది. బాబీడియోల్ పవర్ ఫుల్ గా కనిపించాడు. దిశా పటాని టైంపాస్ క్యారెక్టర్. కార్తి ఓ క్యామియో రోల్ లో కనిపిస్తాడు. ఆ గెటప్ కాస్త వింతగా వుంటుంది. పిల్లాడిగా కనిపించిన నటుడికి మంచి ప్రాధన్యత వుంది. తన నటన ఓకే అనిపిస్తుంది. మిగతా నటులు పెద్దగా గుర్తుపట్టేలా వుండరు.
దేవిశ్రీ హెవీ మ్యూజిక్ ఇచ్చారు. చాలా చోట్ల తన బిజియం నిలబడింది. కొన్ని చోట్ల శృతిమించిన ఫీలింగ్ కూడా కలిగిస్తుంది. కెమెరాపనితనం, ప్రొడక్షన్ డిజైన్, గ్రాఫిక్స్.. ఇవన్నీ కూడా రిచ్ గా వుంటాయి. తెలుగు డబ్బింగ్ అంతగా కుదరలేదు. త్రీడీ లో ఏదో తేడా వుంది. ముఖాలు కొంగ మాదిరిగా బయటికి పొడుచుకొచ్చినట్లు కనిపించాయి. వీలైనంత వరకూ 2డీలో చూడడమే బెటర్. ఎన్ని హంగులు, అర్భాటాలు వున్నా కథలోని ఎమోషన్ ప్రేక్షకుడి కనెక్ట్ కాకపోతే ఆస్వాదించడం కష్టం. కథలో బలం లేకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా చేసేది ఏమీ వుండదు. కంగువా విషయంలో సూర్య పరిస్థితి కూడా అంతేనేమో.
తెలుగు360 రేటింగ్: 2/5
-అన్వర్-