తెలుగులో కంగువా చిత్రాన్ని మైత్రీ మూవీస్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ అంటే… ఏపీ, తెలంగాణల్లో భారీగా థియేటర్లు దొరుకుతాయని ఆశిస్తారు. అయితే… కంగువాకు అనుకున్నంత స్థాయిలో థియేటర్లు లేవు. దానికి కారణం.. మైత్రీ పెట్టిన ఫిట్టింగ్. సాధారణంగా సింగిల్ స్క్రీన్స్ లో షేరింగ్ పద్ధతిలో థియేటర్లు తీసుకొంటుంటారు. కానీ.. ‘కంగువా’కు మాత్రం రెంటల్ పద్ధతిలో సినిమాలు ఇవ్వాలని మైత్రీ నిర్ణయించింది. దాంతో ఏసీయస్ సినిమాస్.. తమ థియేటర్లు ‘కంగువా’కు ఇవ్వడానికి నిరాకరించింది. ఏఎంబీ మల్టీప్లెక్స్ లో సైతం ‘కంగువా’కు స్క్రీన్లు దొరకలేదు. షేరింగ్ పద్ధతిలో అయితేనే స్క్రీన్లు ఇస్తామని ఏషియన్ ఖరాఖండీగా చెప్పేసింది. దాంతో మిగిలిన థియేటర్లు కూడా ‘కంగువా’ను ఆడించడానికి ముందుకు రావడడం లేదు.
మైత్రీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం… ‘పుష్ప 2’నే. డిసెంబరు 5న ‘పుష్ప 2’ రాబోతోంది. పుష్పకు కూడా ఇలానే షేరింగ్ పద్ధతిలో థియేటర్లు ఇస్తే, మైత్రీ బాగా నష్టపోవాల్సివస్తుంది. అందుకే ముందుగానే ‘కంగువా’తో థియేటర్లన్నింటినీ ఓ దారిలోకి తీసుకురావాలనుకొన్నారు. కానీ అది ఇప్పుడు వర్కవుట్ అయ్యేలా లేదు. ఇప్పుడు ‘కంగువా’కు థియేటర్లు ఇవ్వకపోతే, రేపు ‘పుష్ప’కు కూడా థియేటర్లు దొరక్కపోవొచ్చు. పెద్ద సినిమా, పైగా క్రేజ్ ఉన్న సినిమా కాబట్టి, ‘పుష్ప 2’ రెంటల్ పద్ధతిలో ఆడిస్తారా, లేదంటే కంగువాకు చేసినట్టే డిమాండ్ చేస్తారా? అనేది పెద్ద ఫజిల్ గా మారింది. కాకపోతే ఈలోగా కంగువాకు కావల్సిన థియేటర్లు దొరక్కపోవడంతో ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ చూపించే ప్రమాదం ఉంది.