జె.ఎన్.యు.విద్యార్ధి కన్నయ్య కుమార్ ని అరెస్ట్ చేసి తీవ్ర విమర్శలు, అప్రదిష్ట మూటగట్టుకొంది కేంద్రప్రభుత్వం. అతనిని నిర్దోషిగా భావించి డిల్లీ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడంతో కేంద్రప్రభుత్వం అతనిని రాజకీయ కారణాలతోనే వేధించిందనే భావన అందరికీ కలిగింది. అతని విడుదలతో ఈ సమస్య సమసిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో, ఫిబ్రవరి 9న యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన సంఘటనలపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేయబడిన యూనివర్సిటీ ఉన్నత స్థాయి కమిటీ, మార్చి 11న తన నివేదికను యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ ఎమ్.జగదీశ్ కుమార్ కి సమర్పించింది. అందులో కన్నయ్య కుమార్ తో సహా నలుగురు విద్యార్ధులు యూనివర్సిటీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు వారిని యూనివర్సిటీ నుంచి కొంత కాలం కొరకు తొలగించాలని సిఫార్సు చేసింది. ఆ నివేదిక ఆధారంగా అతనితో సహా మరో 20మంది విద్యార్ధులకు ఆరోజు జరిగిన సంఘటనలపై వివరణ కోరుతూ మార్చి 16లోగా సంజాయిషీ కోరుతూ నోటీసులు యూనివర్సిటీ నోటీసులు జారీ చేసింది. వారి సంజాయిషీ సంతృప్తికరంగా లేనట్లయితే 21 మంది విద్యార్ధులపై కూడా చర్యలు తీసుకొనే అవకాశాలున్నాయి. విద్యార్ధులపై చర్యలకు సిఫార్సు చేసిన నలుగురు కమిటీ సభ్యులు, దీనిపై తుది నిర్ణయం తీసుకొనే బాధ్యతను యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ ఎమ్.జగదీశ్ కుమార్ కే విడిచిపెట్టారు.
ఇది యూనివర్సిటీ అంతర్గత వ్యవహారంగా పైకి కనిపిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగానే కన్నయ్య కుమార్ పై చర్యలు తీసుకోవడానికి యూనివర్సిటీ సిద్దపడుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శించినందుకు పరువుపోగొట్టుకొన్న కారణంగా కేంద్రప్రభుత్వంలో పెద్దలు కొందరు, అతనిపై మళ్ళీ ఈవిధంగా కక్ష సాధింపుకి సిద్దపడుతున్నారని యూనివర్సిటీ విద్యార్ధులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఒకసారి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు బయటపడిన కేంద్రప్రభుత్వం, ఒకవేళ కన్నయ్య కుమార్ ని యూనివర్సిటీ నుంచి బయటకు సాగనంపినట్లయితే, ఈసారి అంతకంటే చాలా ఇబ్బందికరమయిన సమస్య ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అతను దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లుగా ఆరోపణలు చేసిన డిల్లీ పోలీసులు వాటిని నిరూపించే ఆధారాలు చూపలేకపోయారు. అలాగే కన్నయ్య కుమార్ తను దేశ వ్యతిరేక నినాదాలు చేయలేదని పదేపదే చెపుతున్నాడు. హైకోర్టు కూడా అతనిని నిర్దోషి అని ప్రకటించి విడుదల చేసింది. ఆ తరువాత కన్నయ్య కుమార్ తో సహా విద్యార్ధులందరిపై విధించిన సస్పెన్షన్ యూనివర్సిటీ స్వయంగా ఎత్తివేసి వాళ్ళందరినీ మళ్ళీ హాస్టల్లో చేర్చుకొంది. ఇంతవరకు దేశంలో ఎవరికీ తెలియని కన్నయ్య కుమార్ ఇప్పుడు దేశంలో చాలా పాపులర్ వ్యక్తిగా మారిపోయాడని భాజపా నేతలే ఒప్పుకొంటున్నారు. దానికి కారణం అతనిని అరెస్ట్ చేయడం, చేసిన తరువాత అతనిని దోషిగా నిరూపించలేకపోవడమేనని స్పష్టం అయ్యింది.
ఇవన్నీ జరిగిన తరువాత యూనివర్సిటీ మళ్ళీ విద్యార్ధులపై అవే కారణాలతో చర్యలకు సిద్దపడుతుండటంతో కోరుండి సమస్యలను ఆహ్వానిస్తునట్లే ఉంది. ఒకవేళ కన్నయ్య కుమార్ తో సహా కొందరు విద్యార్ధులను యూనివర్సిటీ వెళ్ళగొడితే, ప్రతిపక్షాలు మళ్ళీ రంగంలోకి దిగి పార్లమెంటు లోపల, బయటా కూడా దీనిపై రచ్చ రచ్చ చేయడం తధ్యం. అలాగే విద్యార్ధులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మళ్ళీ అక్కడా కేంద్రప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చును. ఈ వ్యవహారంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా విద్యార్ధులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కనుక వాళ్ళు కూడా కార్యాచరణకు దిగితే అల్లకల్లోలం మొదలవుతుంది. జె.ఎన్.యు. విద్యార్ధులపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనే బాధ్యత యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ జగదీశ్ కుమార్ పై మోపడం వలన, మళ్ళీ ఏదయినా తేడా వస్తే ఆయన ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.