భారతీయ జనతా పార్టీ నేతలు చంద్రబాబుపై చాలా అసహనంతో ఉన్నారన్న విషయం చాలా రోజుల నుంచి వారి మాటల ద్వారానే బయటపడుతోంది. ఈ అసహనంతోనే ముఖ్యమంత్రిపై అనేక రకాల అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందో.. అప్పటి నుండి వారికి అన్నింట్లోనూ అవినీతి కనిపిస్తోంది. ప్రతి విషయంలోనూ సీబీఐ విచారణ ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకూ అవినీతికి ఆధారాలున్నాయని… త్వరలోనే సీబీఐ విచారణ కోరతామని చెప్పుకొచ్చేవారు. కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే చంద్రబాబుపై వేట ప్రారంభమవుతుందని కాసుకోవాలని… విష్ణుకుమార్ రాజు లాంటి నేతలు బహిరంగంగానే హెచ్చరించారు. తీరా కర్ణాటక ఎన్నికలు ముగిసేసరికి.. వారి మాటల్లో పదును తగ్గిపోయింది. ఇప్పుడు చంద్రబాబు అవినీతిపై విచారణ చేయించుకునే దమ్ముందా అని సవాల్ చేస్తున్నారు.
విచారణ చేయిస్తాం.. అనే దగ్గర్నుంచి విచారణ చేయించుకోవాలి అనే వరకూ.. బీజేపీ నేతలు తమ వాయిస్‌ను తగ్గించేసుకున్నారు. నిజానికి సీబీఐ సహా అనేక దర్యాప్తులు బీజేపీ చెప్పు చేతల్లోనే ఉన్నాయని చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. లాలూ యాదవ్ ఇలా జైలుకు పంపి.. అలా జేడీయూతో పొత్తు పెట్టుకోవడంలో… సీబీఐ అత్యంత విశ్వసనీయ మిత్రపక్ష పాత్ర పోషించిందని.. చాలా రోజులుగా ఢిల్లీ రాజకీయవర్గాల్లో బహిరంగంగానే ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుటుంబాన్ని సీబీఐ ఎలా వేటాడుతుందో చూస్తూనే ఉన్నాం. ఇవే కాదు.. వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేసి.. జైలులో సుదీర్ఘ కాలం ఉన్న గాలి జనార్ధన ెడ్డి, వైఎస్ జగన్ లాంటి వారి కేసుల విషయంలో ఇదే సీబీఐ ఎలాంటి నిర్లిప్తతను ప్రదర్శిస్తుందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. స్పష్టమైన ఆధారాలున్నా.. బీజేపీకి అత్యంత సన్నిహితంగా ఉండటం వల్లే వారిపై కేసులు నీరుగారుస్తున్నారని ప్రజలు నమ్ముతున్నారు. .
అంటే సీబీఐ .. బీజేపీ పెద్దలు ఎలా చెబితే అలా నడుస్తోందని దీని ద్వారా తెలిసిపోతుంది. మరి గతంలో చెప్పినట్లు.. చంద్రబాబు అవినీతిపై ఆధారాలుంటే..నేరుగా బీజేపీనే సీబీఐని రంగంలోకి దింపవచ్చు కదా..! విచారణ చేయించుకునే దమ్ము ఉందా.. అని చంద్రబాబుకు సవాల్ విసరడం దేనికి..?. కొద్ది రోజుల క్రితం ఎయిర్ ఏషియా అనే విమానయాన సంస్థకు సంబంధించిన ఉన్నతాధికారులు ఇద్దరు.. మాట్లాడుకున్న ఓ టేప్ ను బీజేపీ వర్గాలు మీడియాకు లీక్ చేశాయి. అందులో చంద్రబాబు ప్రస్తావన ఉంది. ఇప్పటికే ఎయిర్ ఏషియా లంచాలిచ్చి పర్మిట్లు తీసుకుందన్న ఆరోపణతో కేసు కూడా నమోదు చేశారు. దీనిపై విజయవాడకు వచ్చి మరీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని… జీవీఎల్ నరసింహారావు కూడా చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడేమిటి…బీజేపీ నేతలు చంద్రబాబే విచారణ చేయించుకోవాలని సవాల్ చేస్తున్నారు..?. కన్నా లక్ష్మినారాయణ తెలివి చూపిస్తున్నారా..? అతి తెలివినా..?