అందరికీ ఇచ్చే పథకాలను కాపులకు ఇస్తూ.. కార్పొరేషన్ ఖాతాలో వేస్తూ.. ఏదో ప్రత్యేకంగా మేలు చేస్తున్నట్లుగా ఏపీ సర్కార్ మోసం చేస్తోందని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. ఏ ప్రభుత్వం అయినా పథకాలను కార్పొరేషన్ ద్వారానే అమలు చేస్తుందని కొత్త లాజిక్‌ను వివరించారు. కాపుల కోసం ఏడాదిలో రూ.4,769 కోట్లు ఖర్చు చేస్తున్నామని మరోసారి ఉద్ఘాటించారు. కాపు నేస్తం అద్భుతమైన పథకమని.. ఆ పథకంపై పవన్ కల్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం కాపు కార్పొరేషన్ పెట్టిన తర్వాత రూ.1840 కోట్లు ఇచ్చిందని.. వాటిలోనే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లు ఇచ్చారన్నారు. అప్పుడు ఎందుకు పవన్ కల్యాణ్ నోరు మెదపలేదని ప్రశ్నించారు. మంత్రి కన్నబాబు.. అదే సమయంలో.. దాదాపుగా వెయ్యి కోట్ల కంటే ఎక్కువగానే కార్పొరేషన్ నిధులతో స్వయం ఉపాధి కింద కాపులకు రుణాలు మంజూరు చేసిన విషయాన్ని కూడా చెప్పారు.
అలాగే గత ప్రభుత్వం.. సామాజిక పెన్షన్లు, అమ్మఒడి, రైతు భరోసా వంటి పథకాలకు ఇచ్చిన డబ్బులను.. కార్పొరేషన్ ఖాతాలో వేయలేదు. కార్పొరేషన్ అంటే.. విడిగా ఆ వర్గం యువత ఉపాధి కోసం కేటాయిస్తారు. కానీ కొత్త ప్రభుత్వం అందరికీ అమలు చేసే పథకాలను కార్పొరేషన్ల కేటగిరీలో వేసి.. వేల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పేస్తోంది. దాన్నే పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తే మంత్రి కన్నబాబు విచిత్రమైన వాదనతో ఎదురుదాడికి దిగారు. చంద్రబాబుపై ప్రేమను పవన్ దాచుకోలేకపోతున్నారని .. పవన్‌కు చంద్రబాబు ప్రపంచ సంస్కర్తగా కన్పిస్తారని మండిపడ్డారు.
ముద్రగడను పచ్చిబూతులు తిట్టినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని సంబంధం లేని అంశాన్ని కూడా తీసుకొచ్చారు. కాపులను ఏపీ సర్కార్ ఘోరంగా మోసం చేస్తోందని.. కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.రెండు వేల కోట్లు కేటాయించి వారిని ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ అధినేత జగన్.. తీరా అధికారంలోకి వచ్చాక.. అందరికీ ఇస్తున్నవాటినే … కాపు లబ్దిదారులను విడిగా చూపి..కార్పొరేషన్ ఖాతాలో వేయడం.. పచ్చి మోసంగా భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా.. ఇదే భిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. కాపుల్లో ఆగ్రహం పెరిగిపోతూండటంతో… ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతున్నట్లుగా భావిస్తున్నారు.