తెలంగాణ చూడండీ… ఆంధ్రాతోనే విడిపోయింది కదా… ఎంచక్కా ప్రాజెక్టులు తెచ్చుకుంటోందో అంటూ పోలిక తెచ్చి మరోసారి మాట్లాడారు ఆంధ్రా భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వే జోన్ విషయంలో కేంద్రం సుప్రీంలో వేసిన అఫిడవిట్ ను కొన్ని పత్రికలు వక్రీకరించాయన్నారు. జోన్ ఇవ్వడం లేదన్న భావనను కలిగించి, ప్రజలను రెచ్చగొట్టే విధమైన అభిప్రాయాన్ని కలిగించడం సరైంది కాదన్నారు. చట్టంలో రైల్వేజోన్ గానీ, కడప స్టీల్ ప్లాంట్ గానీ, పోర్టుగానీ.. ఇలాంటివాటి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మాత్రమే ఉన్నా, కేంద్రం ఇచ్చి తీరుతుందని అనేకమార్లు చెప్పిందన్నారు. రైల్వేజోన్ ఇవ్వడం అనేది ఒక రాజకీయ నిర్ణయమనీ, రాజ్యసభలో చాలా స్పష్టంగా రాజ్ నాథ్ సింగ్ ఇస్తున్నామని చెప్పిన తరువాత కూడా తప్పుడు రాతల ద్వారా ప్రజలను తప్పుతోవ పట్టించడం ఎంతవరకూ సమంజసం అంటూ ప్రశ్నించారు.
ఆంధ్రాకి తాము ఏం చేశామనేది అనేకసార్లు చెప్పామన్నారు. ఏపీ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని ప్రధాని కూడా చాలాసార్లు చెప్పారన్నారు! కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తెలుగుదేశం ప్రభుత్వం తమపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ‘మనతో విభజించబడ్డ తెలంగాణ ప్రభుత్వం, క్వైట్ గా ప్రాజెక్టులు తెచ్చుకోవడానికీ, వాటికి సంబంధించి సమాచారం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికీ, కేంద్రానికి అధికారులు సహకరిస్తూ వాళ్లు చేసుకుంటున్నారు. వాళ్లెక్కడా బజారుకు ఎక్కించడంగానీ, పత్రికల్లో తప్పుడు రాతలు రాయించడంగానీ చేయడం లేదన్నారు. ఇది కూడా ఆంధ్రా రాష్ట్ర ప్రజలు గమనించాలి’ అని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రాజెక్టులు తెచ్చుకుంటోందనీ, కేంద్రంతో సయోధ్యతో ఉందని గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది..? అయినా, విభజన తరువాత రెండు రాష్ట్రాలు సమానంగా ఉన్నాయన్నట్టుగా ఎలా చెప్తారు..? ప్రత్యేకహోదా, రాజధాని నిర్మాణం, రైల్వేజోన్… ఇలాంటివి తెలంగాణకు ఇస్తామని, లేదా ఇవ్వాలని విభజన చట్టంలో లేదు కదా! ఒకవేళ ఉండి ఉంటే… కేంద్రంపై వారి పోరాటం మరోలా ఉండేది. ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్న ట్రాక్ రికార్డు తెరాసకు ఉంది. విభజిత రాష్ట్రంగా ఆంధ్రాకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. దాన్ని వదిలేసి… పక్క రాష్ట్రం చూడండీ, ఎంత సైలెంట్ గా ప్రాజెక్టులు తెచ్చుకుంటోందో అంటే ఎలా..? అయినా, ఆంధ్రాకి న్యాయం చెయ్యండయ్యా అంటే… ఇతర రాష్ట్రాలతో పోలిక ఎందుకు..? విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు, రైల్వేజోన్పైగానీ కడప ఉక్కు కర్మాగారంపై ఎందుకిలా ప్రెస్ మీట్లు పెట్టి వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తోందని కన్నా విశ్లేషించుకుంటే వాస్తవాలు అర్థమౌతాయి కదా!