ఒక రాజకీయ నాయకుడు… ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారాలంటే… ఒక ప్లాన్ ఉంటుంది! కనీసం మూడు దశలు ఉంటాయి. మూడో దశ పార్టీలో చేరిక. రెండో దశ అనుచరగణంతో ఒత్తిడి పెంచుకోవడం! తొలి దశ.. పుకార్ల రూపంలో, లేదా కార్యకర్తలూ అభిమానుల మనోభావాల రూపంలో తమ అభీష్టాన్ని అంతర్లీనంగా బయటపెడుతూ ఉండటం! అట్నుంచి ఇటు ఎందుకు చెప్పుకున్నామంటే… కన్నా లక్ష్మీ నారాయణ ఇప్పుడు మొదటి దశలో ఉన్నారని చెప్పడం కోసం!
గుంటూరు జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు ఆయన. రాష్ట్రస్థాయి రాజకీయాల్లో కూడా బాగానే చక్రం తిప్పారు. పెదకూరపాడు నియోజక వర్గం నుంచి 9 సార్లు గెలిచిన చరిత్ర ఆయనది. గుంటూరు ఈస్ట్ నుంచి కూడా రెండుసార్లు గెలిచి, మంత్రిగా కూడా ఓ వెలుగు వెలిగారు. ఎప్పుడైతే రాష్ట్ర విభజన తెరమీదికి వచ్చిందో… కన్నా రాజకీయ వెలుగు కొడిగట్టడం మొదలైంది! తెలంగాణ ఏర్పాటైన తరువాత ఆయన రాజకీయ ప్రస్థానం సమూలంగా మారిపోయింది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా పోయింది. ఒక్కటంటే ఒక్కసీటు కూడా ఎన్నికల్లో దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత, 2015లో భాజపాలో చేరారు కన్నా!
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, పైగా రాష్ట్రంలో సొంతంగా ఎదగాలన్న లక్ష్యంతో ఉన్న భాజపాతో జతకడితే పొలిటికల్ ఫ్యూచర్‌కు ఎలాంటి డోకా ఉండని అంచనా వేశారు! సామాజిక వర్గ సమీకరణ పరంగా భాజపాలో తనకు అగ్రతాంబూలం ఉంటుందని అనుకున్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పంచనే భాజపా ఉండిపోయింది. భవిష్యత్తులో కూడా ఉండాల్సి వస్తుంది! సొంత స్టామినా కోసం బయటకి వచ్చే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు! పోనీ, తనలోని గూడుకట్టుకుంటున్న అసంతృప్తినీ, పార్టీ భవిష్యత్తుపై తనకున్న అంచనాలను ఏ వెంకయ్య నాయుడుకో చెప్పుకున్నా… చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే! ఈ వాస్తవం కన్నాకి తెలియంది కాదు కదా!
సో… కన్నా ఇప్పుడేం చేస్తారు! ఎకార్డింగ్ టు స్టేజ్ వన్.. కార్యకర్తలు, అభిమానులు ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారట! ఇన్నాళ్లూ వ్యతిరేకించిన వారి పంచనే ఉండటం ఇబ్బందిగా ఉంటోందని అంటున్నారట! సర్దుబాట్లు కష్టంగా ఉందనీ, గుర్తింపు కూడా దక్కడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఉండే కంటే బయటకి వచ్చేస్తే మేలంటూ కన్నా ముందు అభిమానులు వాపోతున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇంకేముంది, పార్ట్-2 ప్రారంభం కోసం వేచి చూద్దాం!