ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అగ్రవర్ణాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇంకా చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ… ఒకవేళ ఇంకా చంద్రబాబును ఎవరైనా నమ్మితే, అలాంటివారిని భగవంతుడు కూడా కాపాడలేరంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు! టీడీపీ పాలన గురించి మరోసారి ప్రజలు ఆలోచించాలన్నారు. మాలా మాదిగిల మధ్య చిచ్చుపెట్టారనీ, కాపులు బీపీల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టారనీ… అలాగే ఇప్పుడు అగ్రవర్ణాల్లో గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు.
ఈ రాష్ట్రంలో అరాచకాలూ దోపిడీలు జరుగుతున్నాయనీ, నాయకులు నిర్భయంగా నిర్లజ్జగా దోచుకున్నారు అని ఆరోపించారు కన్నా. ఒకవేళ మరోసారి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇస్తే… రాష్ట్ర ప్రజల ధన మాన ప్రాణాలకే భంగం కలిగే పరిస్థితి ఉంటుందన్నారు. ‘మరోసారి మోడీ’ అంటూ ఓ పుస్తకం కూడా ఈ సందర్భంగా కన్నా విడుదల చేశారు. మరోసారి టీడీపీకి అధికారం ఇవ్వొద్దని ప్రజలకు కన్నా పిలుపునివ్వడం వరకూ బాగానే ఉంది. సరే, ఇంతకీ ఏపీలో ఎవరికి అధికారం ఇవ్వాలంటూ కన్నా లక్ష్మీనారాయణ ప్రజలను కోరినట్టు..? ఆ ఆప్షన్లు కూడా కన్నా ఇస్తే బాగుంటుంది కదా. మరోసారి మోడీ వస్తే ఆంధ్రాకి మేలు జరుగుతుందని కన్నా అంటున్నారు! నిన్ననే… కేంద్రమంత్రి గట్కరీ వచ్చి… గడచిన ఐదేళ్లలో మోడీ పాలనలో ఏపీకి స్వర్ణయుగమైందని చెప్పారు. స్వర్ణయుగం చేసేశాక… ఇంకా చేయాల్సింది ఏముందని మళ్లీ మోడీ రావాలంటున్నారు..?
ఏపీ విషయంలో భాజపాకి స్పష్టత లేదనేది పదేపదే ఆ పార్టీ నేతలే స్పష్టం చేస్తున్నారు. గడచిన ఐదేళ్లలో ఏపీకి చాలా చేసేశాం అంటారు. కానీ, ఆ చాలా ఏంటో ఎక్కడో ఎలాగో అనేది ఏపీ భాజపా నేతలు కూడా చెప్పడం లేదు. ఇప్పుడేమో… టీడీపీ మరోసారి వద్దని కన్నా అంటున్నారు, కానీ ఎవరు వస్తే కరెక్టో చెప్పడం లేదు. ఆంధ్రాలో భాజపా ప్రభావం ఏమీ ఉండదనేది అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష వైకాపా, తెరాసతో చేతులు కలుపుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇమేజ్ మారుతున్న పరిస్థితి. మిగిలింది జనసేన… రాష్ట్రంలోని ప్రస్తుతం నెలకొంటున్న రాజకీయ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ ఎలాంటి పాత్ర పోషించేందుకు సిద్ధమౌతుందో ఇంకా స్పష్టత రావాలి. ఇవన్నీ ఒకెత్తు అయితే… సమస్యల్లో ఉన్న ఆంధ్రాకు కావాల్సిన నాయకత్వం ఎలాంటిది అనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు మొదలైన అభివ్రుద్ధి కొనసాగాలంటే ఎవరు సమర్థులో అదీ తెలుసు. అందుకేనేమో… ప్రత్యామ్నాయం ఎవరు అనేది కన్నా చెప్పలేకపోయింది.