హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై మిత్రపక్షం బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడొకరు నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటంలో నిర్లక్ష్యం వహిస్తున్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోనున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. ఎన్నికలముందు కాపులను బీసీల్లో చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారని, ఇప్పుడు దానిని మరిచిపోయారని విమర్శించారు. కాపులను బీసీల్లో చేర్చే విషయమై పుట్టుస్వామి కమిషన్ నివేదిక ఉండగానే దానిని పక్కనపెట్టి మరో కమిటీని వేయటం కాపుల్లో ఆందోళనను కలిగించేవిధంగా ఉందని అన్నారు. నేడు జరగనున్న కాపు గర్జన ప్రభావం మొదట పడేది చంద్రబాబుపైనేనని చెప్పారు. తుని బహిరంగ సభకు లక్షలాది ప్రజలు ఇప్పటికే బయలుదేరారని అన్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులను మోహరిస్తోందని తనవద్ద సమాచారం ఉందని, ఇది విచారకరమని చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ, మరో బీజేపీ నేత సోము వీర్రాజు సమయం దొరికినప్పుడల్లా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.