ఢిల్లీలో ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. మరోసారి ఏపీ సర్కారుపై విమర్శలు చేశారు. పరిపాలనా వ్యవస్థను టీడీపీ నాశనం చేసిందన్నారు. 2014 వరకూ ఆంధ్రాలో అంతా బాగుండేదనీ, ఆ తరువాత అన్ని వ్యవస్థల్నీ ఒక్కోటిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. రైతు రుణాల వ్యవస్థను టీడీపీ కుప్పకూల్చి, ఇవాళ్ల అన్నదాతలు బ్యాంకులకు వెళ్లే పరిస్థితి లేకుండా చేసిందన్నారు.
ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగానికి సంబంధించిన ఒక పాత క్లిప్ ను మొబైల్ లో ప్లే చేశారు కన్నా! ‘సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందంటే ఆ ఘనత ఎవరికైనా దక్కాలంటే… ఆ వ్యక్తి మరెవ్వరో కాదు వెంకయ్య నాయుడు గారు’ అంటూ మోడి చెప్పిన మాటల్ని కన్నా వినిపించారు. ఆ తరువాత, కన్నా మాట్లాడుతూ… ప్రత్యేక ప్యాకేజీని తయారు చేసిన వ్యక్తి వెంకయ్య నాయుడు అని ప్రధాని ఆనాడే చెప్పారన్నారు. అందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెంకయ్య నాయుడుని గుర్తుపెట్టుకోవాలని ప్రధాని చెప్పారన్నారు! అదే అంశమై అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారనీ, ప్రత్యేక ప్యాకేజీని వెంకయ్య నాయుడు సాధించారని మెచ్చుకున్నారని గుర్తుచేశారు. ఆ సమయంలో ఆయన్ని విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నాలకు తిప్పి సన్మానాలు చేశారన్నారు. ‘ఇవాళ్ల మీరు యూ టర్న్ తీసుకుని మమ్మల్ని మోసం చేశార’న్నారు కన్నా.
ప్రస్తుత సందర్భంతో ఏమాత్రం సంబంధం లేని వెంకయ్య నాయుడు ప్రస్థావనను కన్నా ఎందుకు తీసుకొచ్చారు..? ఎప్పటిదో మోడీ మాట్లాడిన ఆడియో క్లిప్ వెలికితీసి మరీ ఎందుకు బయటపెట్టారు..? అంటే, ప్రత్యేక ప్యాకేజీని కూడా తమ పార్టీ నాయకుడైన వెంకయ్య గొప్పగా తయారు చేశారూ.. ఆ క్రెడిట్ కూడా తమదే అని చెప్పాలనుకుంటున్నారా..? లేదంటే, చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా పేరున్న వెంకయ్య తయారు చేసిన ప్యాకేజీనే ఇవాళ్ల టీడీపీ కాదంటోందని గుర్తు చేస్తున్నారా…? వెంకయ్య నాయుడుకి సన్మానాలు చేసి మరీ ప్యాకేజీకి ఆమోదం తెలిపి, ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని విమర్శించాలని భావిస్తున్నారా..? ఇంతకీ, ఏ ఉద్దేశంతో వెంకయ్య పేరును కన్నా మీడియా ముందుకు తెచ్చినట్టు..? దీని వల్ల భాజపాకి అదనంగా కలుగుతున్న ప్రయోజనం ఏముంటుంది..? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉంటాయి కదా! వెంకయ్య నాయుడిని ఉప రాష్ట్రపతిని చేశారు. దాంతో ఆయన క్రియాశీల భాజపా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ వెర్సెస్ కేంద్రం లొల్లి విషయంలో కూడా ఆయన జోక్యం చేసుకోవడం లేదు. మరి, ఇప్పుడు ఆయన ప్రస్థావనను కన్నా ఎందుకు తెస్తున్నట్టు…?