ఆంధ్రప్రదేశ్ భాజపా అజెండా అనూహ్యంగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది..! గడచిన మూడురోజులుగా ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆ తేడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. గురువారం నాడు కర్నూలులో జరిగిన ఓ కార్యక్రమంలో కన్నా మాట్లాడుతూ… ఏపీ మంత్రి నారా లోకేష్ మీద అవినీతి ఆరోపణలు చేశారు. బినామీ పేర్లతో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను లోకేష్ నడుపుతున్నారనీ, పెద్ద ఎత్తున నిధులు పక్కదార్లు పడుతున్నాయంటూ కన్నా ఆరోపించారు. టీడీపీ అనుకూలంగా ఉండేవారికి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారంటూ విమర్శించారు. నిరుద్యోగులను చంద్రబాబు సర్కారు మోసం చేసిందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అవినీతి బురదలో పొర్లాడుతున్నాయనీ, వారు రాఫెల్ కొనుగోళ్లుపై విమర్శ చేస్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు కన్నా. లేని కుంభకోణాన్ని ఉందంటూ, తమకు అనుకూలంగా ఉన్న ప్రచార మాధ్యమాలతో టీడీపీ ప్రచారం చేస్తోందన్నారు.
మొన్న కూడా ఇలానే చంద్రబాబు పాలన అవినీతిమయం అంటూ ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఆ అవినీతి ఎండగట్టడమే లక్ష్యంగా వచ్చే నెలలో రాష్ట్రంలో మూడు మెగా ధర్నాలను భాజపా నిర్వహించే సన్నాహాల్లో ఉన్నట్టుగా ప్రకటించారు కన్నా. దీంతో ఏపీ భాజపా వ్యూహంలో మార్పు వచ్చిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రెస్ మీట్ పెడితే చాలు… ఆంధ్రాని భాజపా చాలా అభివృద్ధి చేసిందీ, ఇచ్చిన హామీల కంటే ఎక్కువ సాయం చేసిందీ, దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ చెయ్యనంత సాయం భాజపా సర్కారు మాత్రమే చేసిందంటూ ఊదరగొట్టేవారు. ఇప్పుడు కేంద్ర సాయం అనే అంశాన్ని నెమ్మదిగా పక్కన పెట్టేస్తున్నట్టుగా ఉంది.
ఆంధ్రాకి కేంద్రం ఎంతో చేసిందన్న ప్రచారాన్ని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనే విశ్లేషణ ఇటీవలే కాకినాడలో జరిగిన ఓ సమావేశంలో భాజపా నేతల మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇంకా అదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదనీ, దానికి బదులుగా టీడీపీ అవినీతి పాలన అంశాన్నే ప్రచార అజెండాగా మార్చుకుందామనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరి, ఇప్పటికే ఈ తరహా ప్రచారాన్ని చేస్తున్న వైకాపా భావజాలానికి దగ్గరగా భాజపా వ్యూహం ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! ఏదేమైనా, కేంద్ర సాయంపై ఏపీ భాజపాకి ఒక స్పష్టత వచ్చిందన్నది వాస్తవం. దానికి అనుగుణంగానే భాజపా కార్యాచరణ కనిపిస్తోంది. ఇప్పుడా అంశాన్ని పక్కన పెట్టెయ్యడం ద్వారా… ఆంధ్రాకి భాజపా చేసిందేం లేదని ఆ పార్టీ నేతలే చెప్పకనే ఒప్పుకున్నట్టుగా ఉంది.