వచ్చే నెల 23న పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. రాజధాని అమరావతిలో పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా మరోసారి భాజపాకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనీ, అత్యధిక స్థానాలను భాజపా గెలుచుకుని తిరుగులేని శక్తిగా అవతరిస్తుందనీ, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మరోసారి అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్నికల గురించి మాట్లాడుతూ… 174 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజక వర్గాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు గట్టి పోరాటం చేశారన్నారు!
ఇతర రాజకీయ పార్టీలకు ధీటుగా భాజపా కూడా గట్టి పోటీని ఇచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు కన్నా. ఎందుకంటే, పంచాయతీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ ఎన్నికలు త్వరలోనే వస్తున్నాయన్నారు. ఈలోపుగా బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు నూటికి నూరుశాతం పూర్తి కావాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటాల్సిన అవసరం ఉందనీ, పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని కన్నా చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఇతర పార్టీలకు ధీటైన పోటీ ఇచ్చామని కన్నా చెప్తున్నారుగానీ… ఏయే స్థానాల్లో ఇచ్చారో స్పష్టంగా చెప్పడం లేదే! మరోసారి జాతీయ స్థాయిలో భాజపా గెలుస్తుందని సంబరాలే అంటున్నారు తప్ప, దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన గట్టిపోటీకి సంబరం అనడం లేదు!
ఎన్నికలు ఫలితాలు వచ్చిన వెంటనే జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని అంటున్నారు! నిజానికి, గడచిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లోనే కమిటీల ఏర్పాట్లు లాంటి పార్టీ నిర్మాణ కార్యక్రమాలి జరగాలి. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి వచ్చిన దగ్గర్నుంచీ, ఎన్నికల వరకూ ఏపీ భాజపా నేతలకు చాలా సమయం దొరికింది. కానీ, దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. రాష్ట్రంలో సొంతంగా పోటీ చేస్తున్నామని నిర్ణయించుకున్నాక కూడా… టీడీపీ వ్యతిరేక పార్టీలకు మద్దతుగా నిలిచే ప్రయత్నమే చేశారు. భాజపా సొంత అజెండాగానీ, సొంత విధానాలనుగానీ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లలేకపోయారు. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా, ఏపీకి రావాల్సిన ఇతర ప్రయోజనాలు… వీటిపై ఇప్పటికీ ఏపీ భాజపాకి స్పష్టత లేదు. ఏపీ ప్రజలు భాజపా నుంచి ఆశిస్తున్నవే ఇవి. వీటిపై మాట్లాడకుండా… స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైపోవాలని పిలుపునిచ్చేస్తే ఎలా..? ప్రజల్లోకి మరోసారి వెళ్లి ఏం చెప్తారు..? పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేనప్పుడు బలోపేతం ఎలా అవుతుంది..?