ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా కన్నా లక్ష్మినారాయణను నియమిస్తూ.. .అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. సోము వీర్రాజుకు… ఎలక్షన్ మెనేజ్మెంట్ కమిటీ స్టేట్ కన్వీనర్ అనే పోస్టును కట్టబెట్టారు. కర్ణాటక ఎన్నికలు ముగిసిన ఒక్క రోజుకే.. నియామకాన్ని ప్రకటించడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కొద్ది రోజుల క్రితం కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ కేంద్ర కార్యాలయానికి పంపి… తర్వాతి రోజే…వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా బయలుదేరే సమయానికి ఏం జరిగిందో ఏమో కానీ… హైబీపీతో ఆస్పత్రి పాలయ్యారు. దీనిపై రకరకాల చర్చలు ప్రచారంలోకి వచ్చాయి. కన్నాను… వైసీపీలో చేర్చుకోవద్దని… నేరుగా అమిత్ షా ఫోన్ చేసి జగన్ కు చెప్పారని… అదే సమయంలో… ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తామని కన్నాకు హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజయమయింది. రాజీనామా చేసిన కన్నాను…నేరుగా ఏపీ బీజేపీ అధ్యక్షునిగా నియమించారు.
కన్నా లక్ష్మినారాయణ కాంగ్రెస్ పార్టీలో దిగువ స్థాయి నుంచి ఎదిగిన నేత. విద్యార్థి నేతగా ఉంటూ.. రాజకీయాల్లో క్రమంగా ఎదిగారు. పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గుంటూరు వెస్ట్ నుంచి కూడా గెలిచారు. మంత్రిగా సుదీర్ఘ కాలం ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపునే పోటీ చేసి… ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటే.. గుంటూరు వెస్ట్ సీటు దక్కుతుందని ఇంత కాలం ఆశిస్తూ వచ్చారు. కానీ పొత్తు తెగదెంపులు చేసుకోవడం… గతంలో కాంగ్రెస్‌కు ఉన్న పరిస్థితే బీజేపీకి రావడంతో… వైసీపీ వైపు చూశారు. కానీ వైసీపీ, బీజేపీ అగ్రనేతల మధ్య కొత్తగా ఏర్పడిన బంధంతో ఆయన బలవంతంగా బీజేపీలో కొనసాగిల్సిన పరిస్థితి ఏర్పడింది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీతో పొత్తు ఉంటుందని… కచ్చితంగా … కన్నా లక్ష్మినారాయణ రాజకీయ భవిష్యత్‌కు తాము భరోసా ఇస్తామని బీజేపీ హైకమాండ్ మాటిచ్చినట్లు తెలుస్తోంది. కన్నా లక్ష్మినారాయణతో పాటు ఆయన అనుచరులకు సంబంధించిన సీట్లను పొత్తులో భాగంగా జగన్ కేటాయిస్తారని… అమిత్ షా స్పష్టమైన హామీ ఇచ్చినట్లు కన్నా అనుచరులు చెబుతున్నారు. ఒక వేళ పొత్తులేకపోయినా… కన్నా పోటీ చేసే చోట డమ్మీ అభ్యర్థులు నిలబెట్టేలా… వైసీపీతో అవగాహన ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి అసలు పార్టీకే గుడ్ బై చెప్పిన నేతకు… ఏకంగా అధ్యక్ష పదవి ఇచ్చేశారు అమిత్ షా. విశేషం ఏమిటంటే్.. కన్నా ఇంటి ముందు.. ఇప్పటి వరకు.. వైసీపీలో చేరుతున్న తమ నేతకు శుభకాంక్షలు చెబుతూ…ఆయన అనుచరుల పెట్టిన ఫ్లెక్సీలు ఇంకా ఉన్నాయి. అధికారిక ప్రకటన వచ్చిందంటే.. కన్నా ఆమోదం ఉందని భావించాలి కాబట్టి… ఇప్పటికిప్పుడు…కొత్తఫ్లెక్సీలుపెట్టేసుకుంటారేమో.