రాష్ట్రంలో వరదలు ఉన్న సమయం లో ప్రజల బాగోగులు, భద్రత గాలికొదిలేసి జగన్ అమెరికా పర్యటన చేస్తున్నాడంటూ కొందరు నేతలు విమర్శలు గుప్పించారు. విజయవాడలో వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీ నాయకులు మాత్రం చంద్రబాబు ఇంటికి వరద రాజకీయాలు చేస్తున్నారని మరి కొందరు నేతలు విమర్శలు గుప్పించారు. వివరాల్లోకి వెళితే..
బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేస్తూ, “రాష్ట్రంలో వరదల సమయంలో ప్రజల బాగోగులు అక్కరలేని సీఎం అమెరికా వెళ్లారు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినాయన ‘కొంప మునిగి’ హైదరాబాద్ జారుకున్నాడు..వారిద్దరి ‘తోక నేతలు’ చేస్తున్న చర్చ “ఇల్లు మునిగిందా,లేదా”? ఇల్లు సంగతి వదిలేయండి మీ రెండు పార్టీల వలన రాష్ట్రం నిండా మునుగుతోంది ” అని రాసుకొచ్చారు. అలాగే మరొక నేత తులసి రెడ్డి కూడా జగన్ పై విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ రాష్ట్రాన్ని వదిలి అమెరికా వెళ్లడం బాధాకరమని పేర్కొన్న తులసి రెడ్డి, వరద ముంపు ప్రాంతాలను పట్టించుకోకుండా చంద్రబాబు ఇల్లు మునిగిందా? లేదా? అంటూ వైఎస్ఆర్ సీపీ, టిడిపి పార్టీలు రొచ్చు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ సీపీ నేత అంబటి రాంబాబు మాత్రం గత ఐదేళ్లు రాష్ట్రంలో కరువు కాటకాలు ఉన్నాయని, జగన్ అధికారం చేపట్టడం వల్ల రాష్ట్రం లో జలకళ వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వ్యాఖ్యలు అంతగా ఆనందాన్ని కలిగించలేదు.
ఏది ఏమైనా వరదల కారణంగా, వరదల సమయంలో జగన్ ప్రజలను సందర్శించకుండా అమెరికా పర్యటన చేయడం కారణంగా ప్రస్తుతానికి రాజకీయ విమర్శలు రాష్ట్రంలో బలంగా వినిపిస్తున్నాయి.
https://twitter.com/klnbjp/status/1162562015912574978