కన్నా లక్ష్మినారాయణకు బీజేపీలో ఎట్టకేలకు గౌరవనీయమైన పదవి దక్కింది. ఏపీ బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించిన తర్వాత ఆయనకు పెద్దగా పని లేకుండా పోయింది. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటీవల సోమును తొలగించి మళ్లీ కన్నాకే ఆ పదవి ఇస్తారన్న ప్రచారమూ జరిగింది. అయితే అనూహ్యంగా బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆయనకు చోటు దక్కింది. దేశం మొత్తం మీద 80 మంది సభ్యులు ఉన్న ఆ కమిటీలో బీజేపీకి అత్యున్నతం. అందులో ఏపీ నుంచి ఒక్క కన్నా లక్ష్మినారాయణకు మాత్రమే చోటు దక్కింది. తెలంగాణ నుంచి నలుగురు ఉన్నారు.
ఈ కమిటీలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి , రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ, పీయూష్ గోయల్ వంటి ముఖ్య నేతలందరూ ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా యాభై మందిని ప్రకటించారు. ఈ జాబితాలోనూ ఏపీ నుంచి ఎవరూ లేరు. తెలంగాణ నుంచి విజయశాంతి, ఈటల రాజేందర్‌కు అవకాశం కల్పించారు. పార్టీలకు ఉన్న బలాన్ని బట్టి.. బలమైన నేతలను బట్టి ఈ కమిటీలో ప్రాథినిధ్యం కల్పించారు. ఏపీలో చెప్పుకోదగిన బీజేపీ నేత ఎవరూ లేకపోవడంతో కన్నాకు అవకాశం దక్కింది.
మరో వైపు ఈ పదవుల నుంచి తమ పార్టీలో ఉన్న గాంధీలను బీజేపీ దూరం పెట్టింది. మేనకా గాంధీ, వరుణ్ గాంధీలకు పార్టీలో ఎలాంటి పదవులు లేకుండా చేశారు. ఇటీవల రైతులపై కారుతో దూసుకెళ్లిన ఘటన వ్యవహారంలో వరుణ్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది ఆ పార్టీ హైకమాండ్‌కు ఇబ్బందికరంగా మారింది. అందుకే వారిని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.