బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ హఠాత్తుగా.. ఐటీ గ్రిడ్ కేసును తెరపైకి తీసుకు వచ్చారు. ఇందు కోసం.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓ లేఖ రాశారు. తక్షణం .. ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్‌ను అరెస్ట్ చేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఆధార్ సమాచారం, ఓటర్ల డేటా చోరీ చేసిన కేసులో… ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు .. అందర్నీ విస్మయపరుస్తోందని.. కన్నా విస్మయం వ్యక్తం చేశారు. 7.8 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత డేటాను అపహరించిన వ్యక్తి పట్ల..రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సానుకూలంగా ఉందని ప్రశ్నించారు. కన్నా లక్ష్మినారాయణకు ఇప్పుడు హఠాత్తుగా ఐటీ గ్రిడ్ కేసు ఎందుకు గుర్తుకు వచ్చిందో చాలా మందికి అర్థం కావడం లేదు.
అసలు ఐటీ గ్రిడ్ కేసు ఏపీలో లేదు. తెలంగాణలో నమోదైంది. అక్కడ ప్రభుత్వం గతంలో సిట్ వేసింది. విచారణ జరిపిన తర్వాత.. ఆధార్ డేటా చోరీ చేయలేదని తేలింది. అలాగే.. ఓటర్ కార్డుల డేటా కూడా.. చోరీ జరగలేదని ఈసీ తేల్చింది. టీడీపీ యాప్‌లో ఉన్నదంతా.. సభ్యుల సమాచారం, స్వచ్చందంగా ఇచ్చిన సమాచారమేనని టీడీపీ వాదించింది. దీనిపై.. ఐటీ గ్రిడ్ ఎండీకి.. బెయిల్ కూడా లభించింది. ఇప్పుడా కేసు తెలంగాణ పోలీసుల పరిధిలో ఉందని.. సామాన్యులకూ తెలుసు. అయినప్పటికీ.. కన్నా లక్ష్మినారాయణకు జగన్ లేఖ రాశారు. ఏపీలో కూడా… దీనికి సంబంధించి కేసు ఉంది. కానీ.. అది టీడీపీ యాప్ సమాచారాన్ని ఐటీ గ్రిడ్ కార్యాలయం నుంచి… అక్కడి పోలీసులు దొంగించారనే కేసు. దానిపై విచారణను కన్నా అడగలేదు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో … కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది. ఐటీ గ్రిడ్ కేసును ఉదహరించి.. ఆధార్ డేటాను.. ఎవరూ చోరీ చేయలేదని స్పష్టం చేసింది. ఈ వార్త ప్రముఖ మీడియాల్లో కూడా వచ్చింది. ఈ విషయం కన్నాకు తెలియనిది కాదు. అయినప్పటికీ.. ఏ ఉద్దేశంతో.. సీఎం జగన్ కు ఈ లేఖ రాశారో.. చాలా మందికి అర్థం కావడం లేదు. ఏదైనా తెర వెనుక లాజిక్ ఉంటే.. త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది.