హైదరాబాద్: మాజీ మంత్రి, భారతీయ జనతాపార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ముద్రగడ పద్మనాభం ప్రారంభించిన కాపు రిజర్వేషన్ పోరాట ఉద్యమానికి మద్దతు పలికారు. నిన్న గుంటూరుజిల్లా పొన్నూరులో కాపు వనభోజన సమావేశంలో మాట్లాడుతూ, జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో జరగనున్న కాపు ఉద్యమసభకు కాపులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఏపీలో అధిక సంఖ్యలో ఉన్న కాపులు ఒకరివద్ద తలవంచకుండానే తమ హక్కులను పోరాడి సాధించుకోవచ్చని అన్నారు. ముద్రగడ నాయకత్వంలో ఉద్యమించాలని సూచించారు. ప్రభుత్వ హామీలన్నింటినీ నెరవేర్చుకునే దిశగా ఉద్యమిద్దామని అన్నారు. సభలో పాల్గొన్న మరో మాజీ మంత్రి శనక్కాయల అరుణ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల నాటికి కాపులు ఒక శక్తిగా ఎదిగి ముఖ్యమంత్రి పదవి సాధించుకునే దిశగా వెళ్ళాలని అన్నారు. కాపుల సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించి, పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలని, అప్పటికీ పరిష్కారం కాకపోతే సంఘటిత పోరాటం చేయొచ్చని అరుణ సూచించారు.