కన్నా లక్ష్మినారాయణ ఏ పార్టీలో చేరుతారన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. తన భవిష్యత్ కార్యాచరణపై ఆదివారం ఆయన అనుచరులతో చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరడమే మంచిదని అందరూ తమ అభిప్రాయం చెప్పడంతో కన్నా లక్ష్మినారాయణ కూడా అంగీకరించారు. ఫిబ్రవరి 23న చంద్రబాబు సమక్షంలో కన్నా టీడీపీ కండువా కప్పుకునే తీసుకునే అవకాశం ఉంది.
కన్నాను పార్టీలో చేర్చుకునేందుకు జనసేనతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా చర్చలు జరిపారు. వైసీపీ నుంచి కూడా ప్రతిపాదనలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీని లీడ్ చేయమని కేసీర్ ఆహ్వానించినప్పటికీ ఎంత ఆర్థిక మద్దతు ఉన్నా .. పార్టీని నిలబెట్టలేనని ఆయన ఆశక్తత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో కాపు సామాజికవర్గం ఓట్లను చీల్చడానికి తాను ఓ టూల్గా మారాలని అనుకోలేదు. అలాగే జనసేన పార్టీలో చేరాలనుకున్నా… ఆ పార్టీలో తాను ఇమడలేనన్న అభిప్రాయంతో ఉన్నారు. టీడీపీలో చేరికకు అభ్యంతరం చెప్పే నేతలు కూడా లేకపోవడంతో సుగమం అయింది.
కన్నా లక్ష్మినారాయణకు గుంటూరులో పోటీ చేయడానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. గుంటూర్ వెస్ట్ లో ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేశారు. ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే సత్తెనపల్లిలో టీడీపీకి అభ్యర్థి కొరత ఉంది. గుంటూరు లేదా నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ ఆయన పేరు వినిపిస్తోంది. మొత్తానికి కన్నా చేరికతో టీడీపీకి అదనపు బలం చేకూరినట్లే భావించవచ్చు.