ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు భీమవరంలో ప్రారంభమయ్యాయి. అందరూ వచ్చారు కానీ కన్నా లక్ష్మినారాయణ మాత్రం హాజరు కాలేదు. దీంతో ఇక కన్నా బీజేపీకి లేనట్లేనా అన్న ప్రచారం ప్రారంభమయింది. దీనిక కారణం అసలు జాతీయ కార్యవర్గ సమావేశాలకే కన్నా వెళ్లలేదు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సోము వీర్రాజు ఒక్కరే పాల్గొన్నారు. కార్యవర్గంలో సభ్యుడిగా ఏపీ నుంచి ఒక్క కన్నాకు మాత్రమే సభ్యత్వం ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి సీనియర్ నేతలు పాల్గొంటారని తెలిసినా కన్నా వెళ్లలేదు. హైకమాండ్ ఆరా తీస్తే మనవడి పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమంలో ఉన్నానని చెప్పారు. అదే సమయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నా ఆయన హాజరు కాలేదు. అయితే అక్కడ ఆరా తీసినట్లు ఏపీ బీజేపీలో ఎవరూ ఆరా తీయలేదు. ఎందుకంటే…. సోము వీర్రాజు ఆయన రాకపోతే మంచిదని అనుకుంటూ ఉంటారు. మీడియా మాత్రం కన్నా ఎందుకు రాలేదని ఆరా తీసింది.
కన్నా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. సోము వీర్రాజు అధ్యక్షతన జరిగే ఏ సమావేశానికి కూడా ఆయన హాజరు కావాలని అనుకోవడం లేదని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఆయన జనసేన లేదా టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని.. ఆయన రాజకీయ భవిష్యత్‌పై అంతర్గతంగా చర్చలు కూడా పూర్తి చేశారని… అందుకే బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదన్న వాదన వినిపిస్తోంది.