గడచిన పార్లమెంటు సమావేశాలను ఏపీలో ఎవ్వరూ మరచిపోరు..! ఎందుకంటే, రాష్ట్రానికి వచ్చిన హామీలూ విభజన చట్టంలోని అంశాలపై కేంద్రంలోని భాజపా వైఖరి ఎలా ఉందనేది తేటతెల్లమైన సమావేశాలవి. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఎంపీలు ప్రయత్నిస్తే… ప్రధానితో సహా కేంద్రంలోని అందరూ ముఖం చాటేసినవారే. ఏపీ ప్రయోజనాల అంశమై భాజపా సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే… కనీసం దానిపై చర్చించుకోలేకపోయారు. ఆర్డర్ లో లేదన్న కుంటిసాకుతో లోక్ సభను వాయిదా వేసిన తీరు ప్రజలందరికీ చాలా బాగా గుర్తుంటుంది. అయితే, ఈ ఘటన ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకి మాత్రం గుర్తున్నట్టు లేదు..!
ఢిల్లీలో విలేకరులతో కన్నా మాట్లాడారు. తనపై ఏపీలో జరిగిన దాడి విషయమై కేంద్ర హోం శాఖకు వివరించాననీ, ఘటనపై విచారణ జరిపిస్తారని మాటిచ్చారని చెప్పారు. ఏపీలో దుర్మార్గమైన పాలన సాగుతోందనడానికి నిదర్శనం తనపై జరిగిన దాడే అన్నారు! ఇక, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కూడా కేంద్రాన్ని నిలదీసేందుకు ఇప్పటికే ఏపీ అధికార పక్షం మరోసారి ఇతర పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కన్నా స్పందిస్తూ… పార్లమెంటరీ రూల్స్ ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కు అన్ని పార్టీలకూ ఉంటుందన్నారు. అయితే, చర్చ జరిగే వాతావరణం ఉండాలన్నారు! నోటీసులు ఇచ్చేసి, చర్చ జరగనీయకుండా వీళ్లే చేస్తుంటారన్నారు! ప్రశ్నోత్తరాల సమయం తరువాత చర్చ చేపడదామని స్పీకర్ చెబితే… దాన్ని ఆపేసి చర్చ జరగాలంటూ పట్టుబడతారన్నారు. అంటే, చర్చ జరగకుండా చేయడమే వారి లక్ష్యమనీ, జరిగితే వాస్తవాలు ప్రజలకు తెలిసిపోతాయన్న భయం వారికి ఉందని ఆరోపించారు. మరోసారి అవిశ్వాసం అని అంటుండం కేవలం డ్రామా కోసమేనని కన్నా అన్నారు.
విచిత్రం ఏంటంటే… గత పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాసాన్ని ఎదుర్కొనలేకపోయింది భాజపా! అయినా, ఇక్కడ కన్నా మరచిపోతున్న, లేదా కంఫర్టబుల్ గా డైవర్ట్ చేస్తున్న విషయం ఏంటంటే… సభను సజావుగా నడపాల్సిన బాధ్యత అధికార పార్టీకే ఉంటుంది. లోక్ సభలో అయితే ప్రధానమంత్రే బాధ్యులు అవుతారు. సభలో గందరగోళ పరిస్థితికి కారణమైన నాయకులు లేదా పార్టీలతో లోక్ సభ స్పీకర్ వ్యక్తిగతంగా చర్చించాలి. వారి సమస్యలను తెలుసుకోవాలి. కానీ, గత సమావేశాల్లో స్పీకర్ పోడియం ముందుకు దూసుకొస్తున్న తమిళనాడు ఎంపీలను నిలువరించే ప్రయత్నం స్పీకర్ ఎందుకు సక్సెస్ ఫుల్ గా చెయ్యలేకపోయారు..? సభ ప్రారంభం కావడం.. కాసేపు వాయిదా, ఆ తరువాత మర్నాటికి వాయిదా..! ఇదే కదా గత సమావేశాల్లో జరిగింది. ఏపీ సమస్యలపై చర్చకు భాజపా సిద్ధమని ప్రకటించిన దాఖలాలు లేవు. మరి, ఈ క్రమమంతా ఏపీలో ప్రజలకు బాగానే గుర్తుంది..!