ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న కీలక నేతలతో సమావేశం నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. అయితే, తాజా ఐటీ దాడుల నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా స్పందించారు. టీడీపీ నేతలు ఐటీ దాడులకు ఎందుకు భయపడాల్సి వస్తోందనీ, దొంగలు మాత్రమే ఇలాంటి సమయంలో భయపడుతుంటారని కన్నా వ్యాఖ్యానించారు. సక్రమంగా పన్నులు చెల్లించినవారిపైనే ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తుందన్నారు! ఐటీ ఉద్యోగులు తమ పని తాము చేసుకుని వెళ్తున్నారన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి కేసీఆర్ చేస్తున్న విమర్శలు, ఉపయోగిస్తున్న పదజాలంపై కూడా కన్నా స్పందించారు! కేసీఆర్ వాడుతున్న భాష సరైంది కాదన్నారు. ఎదుటివారిని గౌరవించడం అనేది ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాల్సిన సంస్కారమన్నారు. ఇది చంద్రబాబు నాయుడు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ నేతలు కూడా ప్రధాని నరేంద్ర మోడీని ఇష్టానుసారంగా విమర్శలు చేశారనీ, అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు టీడీపీ నేతల్ని ఎందుకు మందలించలేదన్నారు. మోడీపై చేసిన విమర్శలకు క్షమాపణలు చెప్పాలన్నారు.
ప్రస్తుతం కొంతమంది నేతలను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు జరుగుతున్న వైనం చూస్తున్నాం. కేవలం రాజకీయ ఉద్దేశాల ప్రేరేపితంగానే ఈ దాడులు జరుగుతున్నాయన్నది అందరికీ కనిపిస్తూనే ఉన్న వాస్తవం! తెలంగాణలో రేవంత్ రెడ్డిని లక్ష్యం చేసుకోవడం, అక్కడి నుంచి ఓటుకు నోటు కేసు డొంకను లాగే ప్రయత్నం, ఇప్పుడు ఏపీలో అధికార పార్టీకి చెందినవారిని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వెనక కొంతమంది, లేదా కొన్ని పార్టీల రాజకీయ లక్ష్యాలు లేవని ఎవ్వరూ అనుకోవడం లేదు. ఇక, భాష విషయానికొద్దాం..! పరుష పదజాలం ఎవరు ఉపయోగించినా ఉపేక్షించరాదనీ, ఏపీ సీఎం ఈ విషయం నేర్చుకోవాలన్నారు కన్నా. వాస్తవానికి, చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విమర్శలు దాదాపుగా చెయ్యరనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక, ఏపీ భాజపా నేతల్లో జీవీఎల్, సోము వీర్రాజు వంటివారు చేస్తున్న విమర్శల్లో పరుషం కన్నా గుర్తించడం లేదా? ముందుగా వారి పార్టీ నేతలకి ఇలాంటి హిత వచనాలు చెప్పి, ఆ తరువాత ఇతర పార్టీలకు సూచనలు చేస్తే కొంతైనా అర్థవంతంగా ఉంటుంది కదా!