ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ విభాగానికి అధ్యక్ష పదవి దక్కిన తర్వాత కన్నా లక్ష్మినారాయణ చురుగ్గానే రాజకీయం చేస్తున్నారు. ఏపీని అత్యంత దారుణంగా బీజేపీ వంచించిందన్న విషయం ఇప్పుడు బాగా ప్రజల్లోకి వెళ్లింది. అయినా.. కేంద్రం ఏమీ అన్యాయం చేయలేదని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్లడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ కన్నా లక్ష్మినారాయణ వెళ్తున్నారు. తన వాదనలు తాను వినిపిస్తున్నారు. ఓ ప్రత్యేకహోదా హామీ ప్రధాని ఇవ్వలేదని చెప్పుకున్నా… స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్ హామీలు నెరవేరుస్తామని తెలుసు కాబట్టే టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారని విమర్శించినా.. ఆయన మార్క్ మాత్రం ఎక్కడా మిస్ కాదు. ఇప్పుడు కూడా… కొత్తగా విభజన హామీల అమలుకు.. ఇంకా ఆరేళ్ల సమయం ఉందని.. కొత్త లాజిక్ తీసుకొచ్చారు.
విభజన చట్టంలో పెట్టిన అంశాలు పదేళ్లలోపు నెరవేర్చాలని ఉందని కన్నా లక్ష్మినారాయణ కొత్తగా చెప్పడం ప్రారంభించారు. ఇప్పటికి నాలుగేళ్లే అయిందని .. ఇంకా ఆరేళ్ల సమయం ఉందంటున్నారు. కన్నా లక్ష్మినారాయణ చెప్పినట్లు పదేళ్ల సమయం తీసుకున్నా.. హామీలు నెరవేరుస్తారన్న గ్యారంటీ ఏమిటి..అన్నది సగటు మనిషికి వస్తున్న అనుమానం. ఎందుకంటే.. విభజన హామీలు అమలు చేసేశామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. చట్టంలో పరిశీలించమని ఉన్న వాటిని.. చట్టానికి తగ్గట్లుగా పరిశీలిస్తున్నామని కేంద్రం చెబుతోంది. ఇంకో ఆరేళ్లయినా కేంద్రం వాటిని పరిశీలిస్తూనే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం ఉండదు.
పదేళ్ల కాలపరిమితి ఉందే అనుకుందాం..కేంద్ర విద్యాసంస్థలు.. ఇతర ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్ట్ ఇలా ఏ అంశం తీసుకున్నారు… పదో ఏట నిర్ణయం తీసుకుని.. అప్పటికప్పుడు అమలు చేసేయలేరుగా..?. ఉదాహరణకు.. కేంద్ర విద్యాసంస్థలకు… ఏపీ కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చింది. కొన్నింటిని మంజూరు చేసి అద్దె భవనాల్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. దాదాపుగా పదకొండు విద్యాసంస్థలకు.. నాలుగేళ్లలో రూ.420 కోట్లు ఇచ్చారు. కానీ వాస్తవంగా కావాల్సింది.. దాదాపుగా రూ. 12 వేల కోట్లపైనే. ఇదే విధంగా నిధులు ఇస్తే ఆయా సంస్థల నిర్మాణం పూర్తి కావడానికి రెండు, మూడుదశాబ్దాలు పడతాయి. దామాషా ప్రకారం నిధులు కేంద్రం విడుదల చేస్తున్నా.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు చెప్పే వాదన వినేవారేమో ప్రజలు. కానీ అలాంటి పరిస్థితి లేదు కాబట్టే ఇప్పుడు తిరుగుబాటు..!