టీడీపీకి తలుపు మూసేశాం, ప్రధాని మోడీ గొళ్లెం పెడితే, అమిత్ షా పేద్ద తాళం వేశారు, రాష్ట్రంలో టీడీపీ అల్లల్లాడిపోతుంది, మిగులున్న నాయకులకు భాజపా మాత్రమే దిక్కు, ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యుల్ని లాగేశాం, ఇంకా కొందర్ని లాక్కుంటాం, ఆ తరువాత రాష్ట్రంలో తామే రాజకీయ ప్రత్యామ్నాయం…. ఇదీ ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేస్తున్న వ్యాఖ్యల్లోని సారాంశం. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు వ్యూహమేంటయ్యా అంటే ఇదిగో ఇదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదుగాక ఉండదంటూ కన్నా మరోసారి చెప్పారు. టీడీపీతో పొత్తు తప్ప వేరే అంశం లేనట్టుగా మాట్లాడుతున్నారు. అదొక్కటే భాజపా బలాన్ని పెంచగలిగే అంశం అన్నట్టుగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ తలుపులు మూసేశారు అనే వ్యాఖ్యల వల్ల ఆంధ్రాలో భాజపా ఎదిగే అవకాశం ఉందా…? అది ప్రజాభిప్రాయాన్ని భాజపాకి అనుకూలంగా ఎలా మార్చగలదు..? ఒక పార్టీ ఎదుగుదలకు ఇలాంటి మాటలే సరిపోతాయా, చేతల్లో ఏమీ అవసరం లేదా..?
కేంద్రంలో అధికారంలో ఉన్నాం, గతంలో ఏపీ విభజనకు సాయపడ్డాం, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి చాలా ఇస్తామన్నాం, అవన్నీ కేంద్రం నుంచి రప్పించుకుందాం, తద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్దామనే ఆలోచన రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఏ కోశానాలేదు అనేది పదేపదే నిరూపితం అవుతూనే ఉంటుంది. శాసనసభలో ప్రాతినిధ్యం లేదు, గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం నోటాకి వచ్చిననన్ని ఓట్లు కూడా మనకి పడలేదు, దేశవ్యాప్తంగా మోడీ హవా ఎలా ఉన్నా ఆంధ్రా ప్రజల్లో ఇంత తీవ్ర వ్యతిరేకత ఉంది అనే ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇప్పటికీ అదే ధోరణిలో ముందుకెళ్తున్నారు.
పోలవరం డీపీఆర్ టు అంశం ఆర్థిక శాఖ దగ్గర పెడింగ్ లో ఉంది. ఆ నిధులు విడుదలైతేగానీ ఇక్కడ పనులు ప్రారంభం కావు. అవి తెప్పించి పనులు వేగవంతం చేయించగలిగితే భాజపా ఎదగదా..? ఆ సంగతి కన్నాకి తెలియంది కాదు, కానీ దాని గురించి మాట్లాడరు. రాజధాని అమరావతి మీద తీవ్ర గందరగోళం నెలకొంది. మంత్రి బొత్స రోజుకో ప్రకటన చేస్తారు. దానిపై స్పందించరు! ప్రధాని మోడీయే కదా శంకుస్థాపన చేశారు, ఆయనే కదా ఢిల్లీని తలదన్నేలా కట్టేస్తామన్నారు. కేంద్రమే కదా రాజధాని నిధులు ఇవ్వాలి? అవి విడుదలయ్యేలా చేస్తే… రాజధాని నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి. ఆ నిధులును మేమే ఇచ్చామని ప్రచారం చేసుకుంటే భాజపా ఎదగదా..? అయినా రాజధాని అంశం కన్నాకి అనవసరం. విభజన చట్టంలోని అంశాల అమలుపై కన్నా దృష్టి పెడితే… రాష్ట్రంలో భాజపాను అభిమానించేవారు పెరుగుతారు. అంతేగానీ, మోడీ టీడీపీకి తలుపులు మూసేశాం, తాళాలు వేసేశాం అని పదేపదే చెప్పడం వల్ల ఏమాత్రమూ ఉపయోగం ఉండదు.