అసెంబ్లీ ఎన్నికలు అయిన వరకూ ఒకతీరు, అయ్యాక ఇప్పుడు మరొక తీరుగా కనిపిస్తోంది ఏపీ భాజపా తీరు! ఎన్నికల ముందు వరకూ టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే టార్గెట్. ఎందుకంటే, ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి వచ్చేసింది, రాష్ట్ర ప్రయోజనాలు అంటూ కేంద్రంలోని మోడీ సర్కారుపై చంద్రబాబు తిరుగుబావుటా ఎగరేశారు! కాబట్టి, టీడీపీ ఓడిపోవాలి. ఆ సమయంలో వైకాపా మీద అప్రకటిత సోదరభావాన్నే భాజపా ప్రకటించుకుంది. ఎన్నికల తరువాత కూడా భాజపాకి అనుకూలంగానే ఉంటూ వ్యవహరించే తీరే కనబరచారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏపీలో అధికార పార్టీ మీద విమర్శలు చేయకుండా వచ్చారు! ఇప్పుడు, ఏపీ విషయంలో భాజపా స్టాండ్ పూర్తిగా మారిపోయింది. కాబట్టి, గతంలో చంద్రబాబు నాయుడుని విమర్శించినట్టుగా, ఇప్పుడిప్పడే పాలన మొదలుపెట్టిన జగన్ సర్కారుపై కూడా విమర్శల ఘాటు పెంచేశారు భాజపా నేతలు.
ఓ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… జగన్ పాలనపై ఏపీ ప్రజలు తీవ్రంగా విసుగు చెందుతున్నారన్నారు!! ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైందని విమర్శించారు. ఇసుక పాలసీ మీద వైకాపాకి క్లారిటీ లేదనీ, చాలా అంశాల మీద ఆ పార్టీకి స్పష్టత లోపిస్తోందనీ, వైకాపా పాలన అప్పుడే తిరోగమన బాటలో పయనిస్తోందని విమర్శించారు కన్నా. రాజన్న రాజ్యం తెస్తామని చెప్పిన జగన్, పోలీస్ పాలన అందిస్తున్నారని ఆరోపించారు. రాజన్న ప్రజలతో ఉండి, ప్రజల కష్టాలను తెలుసుకుని పాలించారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి కూడా కన్నా మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీని నడిపించే శక్తి సామర్థ్యాలు ఆయనలో తగ్గిపోతున్నాయని కన్నా విశ్లేషించారు! భవిష్యత్తులో టీడీపీ ఉండదనీ, నాయకుడి సమర్థతపై పార్టీలో అందరికీ అనుమానాలు వస్తున్నాయన్నారు. వయసు, ఆరోగ్యరిత్యా చంద్రబాబు నాయుడు పార్టీని నడపలేరని కేడర్ భావిస్తోందన్నారు. ఇక, ఆయన వారసుడు నారా లోకేష్ నాయకత్వ పటిమ మీద ఎవ్వరికీ నమ్మకం లేదన్నారు. అందుకే, టీడీపీ నుంచి భాజపాకి వలసలు పెరుగుతున్నాయన్నారు.
సో.. కన్నా అస్త్రాలేంటంటే చంద్రబాబు నాయుడు వయసు, జగన్ అనుభవం! ఈ రెండు కారణాలు చూపిస్తూ… టీడీపీ, వైకాపాలు ఏపీకి సరిపడవనే వాదనను ఇప్పట్నుంచే ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి కనీసం ఆర్నెల్లైనా గడవకముందే… వైకాపా తిరోగమనం అనడం సరికాదు. సరే, ఈ రెండు పార్టీలూ కాదు, తామే ప్రత్యామ్నాయం అని చెప్పే ముందు… ఏరకంగా ప్రత్యామ్నాయం, ఏం చేశారని ప్రయత్యామ్నాయం అనేది కూడా ప్రజలకు కన్నా చెప్పాలి కదా!