ఇటీవల తూర్పు గోదావరి జిల్లా వైకాపా అధ్యక్షుడిగా నియమితులయిన కన్నబాబు తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మనసులో మాటని జనాభిప్రాయంగా చెప్పారు. నిన్న జిల్లాలో అన్నవరం వచ్చినపుడు మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో సతమతమవుతున్న ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఆయనని గద్దె దించి, జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకొందామా అని చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ వైకాపా వైపే చూస్తున్నారు,” అని అన్నారు.
ఆయన తెదేపా గురించి కూడా ఒక ఆసక్తికరమయిన వ్యాఖ్య చేసారు. “మా పార్టీ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలను తెదేపాలోకి ఆకర్షించి తీసుకుపోయి వైకాపాను బలహీనపరచగలనని తెదేపా భావిస్తోంది. మా పార్టీని తెదేపా బలహీనపరచడం కాదు తెదేపాయే అంతర్గతంగా చాలా బలహీనంగా ఉంది. అందుకే మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకువెళుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా 90 శాతం మంది కార్యకర్తలు వైకాపాలోనే ఉన్నారు,” అని అన్నారు.
రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యత్రి అయిపోవాలనుకొన్నారు. ముఖ్యమంత్రి కుమారుడు కావడమే తన అర్హతగా భావిస్తున్నారని ఆయన మాటలే తెలియజేస్తున్నాయి. అదే అర్హత సరిపోతుందనుకొంటే దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు అవసరమే ఉండేది కాదు. ఆ తరువాత ఆయన ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలలో పోటీ చేసి తన కల నెరవేర్చుకోవాలని ప్రయత్నించారు కానీ సఫలం కాలేకపోయారు. అప్పటి నుంచి ప్రజలెన్నుకొన్న తెదేపా ప్రభుత్వం పడిపోతుందని, లేకుంటే తనే పడగొడతానని చెప్పుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ అది కూడా సాధ్యం కాకపోగా ఆయన తెదేపాకి విసిరిన ఆ సవాలు కారణంగా ఇప్పుడు తన స్వంత పార్టీకే పెద్ద సమస్య తెచ్చిపెట్టి దానిని పరిష్కరించలేక ఆపసోపాలు పడటం కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. తెదేపా చేస్తున్న పనేమీ సమర్ధించదగ్గది కాదు. కానీ దానిని అందుకు ప్రేరేపించినది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డేనని చెప్పకతప్పదు. ఈ రెండేళ్ళలో తెదేపా ఏనాడు వైకాపా ఎమ్మెల్యేలని ఆకర్షించి ఆ పార్టీని బలహీనపరచాలని ప్రయత్నించలేదని అందరికీ తెలుసు. కనుక ఇది జగన్ స్వయంకృతాపరాధమే.
గత ఎన్నికలలో తెదేపాను వైకాపా ఓడించలేకపోయింది. ఆ తరువాత ఏదో విధంగా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కూడా వీలుపడలేదు. ఇటువంటి పరిస్థితులలో వచ్చే ఎన్నికల కోసం చకోర పక్షిలా ఎదురు చూడటమే వైకాపా చేయగలదు. జగన్మోహన్ రెడ్డి, పార్టీ నేతల మనసులలో నెలకొని ఉన్న ఆ కోరికనే కన్నబాబు ప్రజలకు ఆపాదించి చెపుతున్నారని భావించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈవిధంగా పార్టీకి శల్యసారద్యం చేస్తుంటే వచ్చే ఎన్నికలలో అయినా వైకాపా విజయం సాధించగలదా? చూడాలి.