కర్ణాటకలో రజనీకాంత్ సినిమా “కాలా” సినిమా విడుదల కోసం.. ఆ చిత్ర దర్శక నిర్మాతలు పడిన కష్టాన్ని ప్రపంచం మొత్తం చూసింది. ఇంతా చేసి.. రజనీకాంత్ ఏమి చేశారయ్యా.. అంటే… కావేరీ నీటి వివాదాన్ని కోర్టు చెప్పినట్లు సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పారు. ఇదే తప్పయిపోయింది… కన్నడ సంఘాలకు. అంతే.. కాలా సినిమా మీద పడ్డారు. రిలీజ్ చేస్తే.. బాక్సులు బద్దలయిపోతాయని ధియేటర్ యాజమాన్యలను హెచ్చరించారు. సున్నితమైన విషయంగా మారిపోవడంతో.. చాలా మంది స్వచ్చందంగా సినిమాకు దూరంగా ఉన్నారు. కొంత కాలం గ్యాప్ వచ్చిందేమో.. కన్నడ సంఘాలకు ఇప్పుడు మరో పని పెట్టుకున్నారు. ఈ సారి రజనీ స్థాయి నుంచి సన్ని లియోన్ స్థాయికి దిగజారిపోయారు.
సన్నీలియోన్ “వీర మహా దేవి ” అనే సినిమాలో నటించారు. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ.. “కర్ణాటక రక్షణ వెదిక” సభ్యులు ఆందోళనలుప్రారంభించారు. సన్నీ లియోన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. సినిమా పోస్టర్లు దగ్ధం చేస్తూ.. ప్రదర్శనలు ప్రారంభించారు. “వీర మహా దేవి” సినిమాలో సన్నీ లియోన్ ప్రధాన పాత్రధారి. ఈ సినిమా లో ముఖ్య పాత్ర పోషించడం పై దక్షిణ భారత సంస్కృతికి అవమానం అనేది కన్నడ సంఘాల ఆందోళన . ఇందులో ఆమె పోరాట యోధురాలిగా కనిపించనున్నారు. ఆమె మహారాణి వీరమహాదేవిగా కనిపిస్తే తమ సంస్కృతిని దెబ్బతీసినట్లే అని ఆందోళనకారులు చెబుతున్నారు. సన్నీలియోన్ పోస్టర్లకు చెప్పుల దండలు వేస్తున్నారు.
వీరమహాదేవి సినిమా ఫస్ట్‌లుక్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ వీరమహాదేవి.. ఎవరి జీవిత చరిత్ర ఆధారంగానూ తీయడం లేదని నిర్మాతలు చెబుతున్నారు. కానీ కన్నడ రక్షణ వేదిక సభ్యులు మాత్రం ఆగడం లేదు. తమకు చాలా రోజుల తర్వాత రోడ్ల మీదకు వచ్చే అవకాశం దొరికిందన్నట్లుగా చెలరేగిపోతున్నారు. వీళ్ల ఆందోళన సంగతేమో కానీ.. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.